ఖమ్మం లోక్సభ టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావును చూస్తుంటే తనకు జాలి కలుగుతోందని కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి సెటైర్లు వేశారు. టీడీపీకి రాజీనామా చేసిన నామా నాగేశ్వర రావు ఇటీవల తెరాసలో చేరిన విషయం తెల్సిందే. ఆ పార్టీలో చేరగానే ఆయన్ను ఖమ్మం లోక్సభ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ప్రకటించారు.
అలాగే, కాంగ్రెస్ పార్టీ తరపున రేణుకా చౌదరి పోటీ చేస్తున్నారు. ఆమె నామా నాగేశ్వర రావు పోటీపై స్పందిస్తూ, ముఖ్యమంత్రి కేసీఆర్ను ఎదుర్కోవడానికి ఎవరూ అవసరం లేదని… తానొక్కదానిని చాలన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కోసం కేసీఆర్ కొనుగోలు కేంద్రాలను తెరిచారని విమర్శించారు.
ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీపై కూడా ఆమె విరుచుకుపడ్డారు. ప్రధాని పదవికే కాదు… చౌకీదార్ ఉద్యోగానికి కూడా ఆయన పనికిరారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆమె జోస్యం చెప్పారు. కాగా, ఖమ్మం లోక్సభ స్థానంలో రేణుకా చౌదరి, నామా నాగేశ్వర రావులు పోటీపడటం ఇది మూడోసారి కావడం గమనార్హం. దీంతో ఈ సారి గెలుపుపై కూడా ఉత్కంఠ నెలకొంది.