అవునా.. పవన్‌ను మిస్ గైడ్ చేశారా.. కోన వెంకట్ మాటల్లోని అర్థం ఏమిటి?

0
32
Kona venkat
Kona venkat
Kona venkat
Kona venkat

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై డైరక్టర్ కోన వెంకట్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమైనాయి. పవన్‌ను
రాజకీయాల్లో తప్పటడుగులు వేస్తున్నారని కోన వెంకట్ అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణపై పవన్ చేసిన వ్యాఖ్యలను కోన వెంకట్ తప్పుబట్టారు.

జనసేనాని మాటలు విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని.. ఐదేళ్లలో తెలంగాణలో ఎక్కడా ఆంధ్రా ప్రజలపై దాడులు జరగలేదని పవన్‌కు గుర్తు చేశారు. పవన్ ఎవరి మాటలో విని ఆవేశంగా స్పందిస్తున్నారని కోన అభిప్రాయపడ్డారు. జగన్‌లాగే జనసేనాని కూడా పాదయాత్ర చేస్తే సమస్యల పట్ల అవగాహన వచ్చి ఉండేదన్నారు.

పవన్ ఎన్నికల ముందు మాయావతితో చర్చలు జరిపి పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని కోన వెంకట్ ప్రశ్నించారు. మాయావతి మీకు మదర్ థెరిసాలా కనిపించిందా? దళితుల ఓట్లే కావాలనుకుంటే. అంతకంటే

నిబద్ధత ఉన్న, నిజాయతీ ఉన్న నేతలు కనిపించలేదా? అని ఆయన జనసేనాని ప్రశ్నించారు.

మంగళగిరి, కాకినాడ సభల్లో చంద్రబాబు నాయుడి పాలనపై విమర్శలు గుప్పించిన పవన్.. తర్వాత విమర్శల దాడి తగ్గించాడని కోన అభిప్రాయపడ్డారు. చంద్రబాబును పవన్ విమర్శించినప్పుడు జనం హర్షం వ్యక్తం చేశారన్న ఆయన.. పవన్ ఇన్నాళ్లకు దారిలోకి వచ్చారని అనుకున్నారని కోన చెప్పారు.

జగన్‌పై పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆరోపణల్లో ఒక్కటి నిరూపించినా.. తాను జనసేనా జెండా పట్టుకొని తిరుగుతానని కోన వెంకట్ సవాల్ చేశారు. మాయావతి లాంటి వారితో పొత్తు పెట్టుకొని ఒక్క కేసు కూడా ఫ్రూవ్ కాని జగన్‌ లక్ష్యంగా విమర్శలు ఎందుకు చేస్తున్నారని ఆయన పవన్‌ను ప్రశ్నించారు. పవన్ నాకు సన్నిహితుడని చెప్పిన ఆయన.. కత్తి మహేశ్ వ్యవహారంలో పవన్‌కు అండగా మాట్లాడిన తొలి వ్యక్తి తానేనని గుర్తు చేశారు.

కాగా ఇన్నాళ్లూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై ప్రశంసలు కురిపించిన కోన వెంకట్ తాజాగా విమర్శలు గుప్పించడం చర్చకు దారి తీసింది. దీంతో కోన వెంకట్‌పై పవన్ అభిమానులు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. తెలంగాణపై పవన్ చేసిన వ్యాఖ్యలను ఇంటర్వ్యూలో కోన విమర్శించారు.

దీనిపై స్పష్టతనిస్తూ కోన ఓ ప్రకటనను విడుదల చేశారు. తమ కుటుంబం తాను పుట్టక ముందు నుంచే బాపట్లలో రాజకీయాల్లో ఉందని తెలిపారు. తన తాత కోన ప్రభాకరరావు కాంగ్రెస్‌ పార్టీలో పలుమార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, అసెంబ్లీ స్పీకర్‌గా, ఉమ్మడి రాష్ట్రానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా, మూడు రాష్ట్రాలకు గవర్నర్‌గా ఒక్క మచ్చలేని రాజకీయ నాయకుడిగా తన ప్రస్థానం కొనసాగించారని తెలిపారు.

ఆయన మరణం తర్వాత తన బాబాయి కోన రఘుపతి 1995లో ప్రజాసేవలోకి వచ్చారని, తన సొంత ఆస్తులు కరిగించుకుంటూ ప్రజాసేవలో కొనసాగారని తెలిపారు. 2014 ఎన్నికల్లో తమ కుటుంబానికి, కోన రఘుపతికి ఉన్న ప్రజాదరణ గుర్తించి జగన్‌ వైసీపీ తరఫున పోటీ చేసే అవకాశం ఇచ్చారని.. గెలిచామన్నారు. ఈ ఎన్నికల్లో తాను ప్రత్యక్షంగా పాల్గొని తమ వంతు కృషి చేశానన్నారు.

ఆ సందర్భంలో తన మిత్రుడైన పవన్‌ కల్యాణ్‌ కూడా అభినందించారని కోన ప్రకటనలో వెల్లడించారు. 2014 తర్వాత జనసేనని బలోపేతం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లే సందర్భంలో తాను అండగా నిలిచానన్నారు.

కానీ మాయావతితో పొత్తు విషయంలో, తెలంగాణ విషయంలో ఎవరో పవన్‌ని మిస్‌ గైడ్‌ చేశారని కోన తెలిపారు. అందుకే వాళ్లతో జాగ్రత్తగా ఉండాలని చెప్పానన్నారు. తాను ఈ విషయం చెప్పడానికి కారణం, కొంత కాలం క్రితం పవన్‌, కేసీఆర్‌ను కలిసిన సందర్భంలో తనే స్వయంగా ఆయన పాలన గురించి మీడియా ముందు పొగిడారని గుర్తు చేశారు.

అందుకే ఇప్పుడు తను ఇస్తున్న ప్రకటనలపై అనుమానం వచ్చిందన్నారు. చివరిగా నేను చెప్పేదేంటంటే, మన రాజకీయ ఆలోచనలు, మన కులాలు, మతాలు, ప్రాంతాలు, ఆర్థిక స్తోమతలు, ఇవేవీ స్నేహానికి అడ్డుగోడలు కాకూడదన్నారు. పవన్‌ కల్యాణ్‌ తన ప్రయాణంలో అనుకున్నది సాధించాలని మరోసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని కోన ప్రకటనలో పేర్కొన్నారు.