భారత్-పాకిస్థాన్‌ల మధ్య పరిష్కారానికి నోచుకోని కాశ్మీర్ అంశంపై తాజాగా కామెంట్స్ చేసి ఫేస్‌బుక్ ఇరుక్కుపోయింది. భారత్‌లో అంతర్భాగమైన జమ్మూ కాశ్మీర్‌ను ప్రత్యేక దేశంగా పేర్కొన్న ఫేస్ బుక్.. ఆపై తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పేసింది. ఫేస్ బుక్ వ్యాఖ్యలపై నలువైపుల నుంచి విమర్శలు తలెత్తడంతో జరిగిన తప్పును గుర్తించి క్షమాపణలు చెప్పింది.
ఇరాన్ నెట్‌వర్క్‌లకు టార్గెట్‌గా మారిన దేశాలను ప్రస్తావిస్తూ, ఓ బ్లాగ్ పోస్ట్ పెట్టిన ఫేస్ బుక్, అందులో కాశ్మీర్‌ను ఓ కంట్రీగా పేర్కొంది. ఇరాన్ కేంద్రంగా నడుస్తున్న నెట్‌వర్క్‌లు అనధికార కార్యకలాపాలు చేపడుతున్నాయని, దీంతో ఫేస్ బుక్ లోని 513 ఖాతాలు, గ్రూప్‌లను తొలగించామని వెల్లడించింది. ఆపై కాశ్మీర్‌ను ప్రత్యేక దేశంగా పేర్కొన్నందుకు చింతిస్తున్నామని, ఇకపై అలా జరగకుండా చూసుకుంటామని తెలిపింది.