కేసీఆర్‌తో సీక్రెట్ డీల్.. జగన్‌పై ముప్పేట దాడి.. ఉక్కిరిబిక్కిరి

0
34

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రచారం తీవ్రస్థాయిలో సాగుతోంది. అధికార, విపక్ష పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా, తెరాస అధినేత కేసీఆర్‌తో వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి సీక్రెట్ డీల్ కుదుర్చుకున్న విషయం బట్టబయలు కావడంతో విమర్శల దాడి మరింతగా పెరిగింది.

నిజానికి తెలంగాణ ఉద్యమ సమయంలో తెరాస అధినేతగా కేసీఆర్ పేరు దశాబ్ధన్నర కాలంగా దేశవ్యాప్తంగా మార్మోగింది. తెలంగాణ రాష్ట్ర సీఎంగా ఉన్నప్పటికీ ఆయన హవా ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు ఆంధ్రాలోనూ ఆయన ప్రస్తావనే వస్తోంది. అధికారపక్షమైనా.. ప్రతిపక్షమైనా… మాట్లాడుతోంది.. తెలంగాణ, కేసీఆర్ గురించే…!

తెదేపా ఎదురుదాడి జగన్​ను అడ్డుపెట్టుకుని తెలంగాణ ముఖ్యమంత్రి పెత్తనం చేయాలని చూస్తున్నారన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు దాడిచేస్తున్నారు. పనిలోపనిగా తెలుగు ఆత్మగౌరవ నినాదాన్ని తెరపైకి తెచ్చారు. కేసీఆర్ టార్గెట్​గా జగన్​పై ఎటాక్ చేస్తున్నారు. ఆంధ్రుల్ని, ఆంధ్రా సంస్కృతిని అవమానపర్చిన వ్యక్తితో దోస్తీ చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా అంటూ నిలదీస్తున్నారు.

విభజన చట్టం ప్రకారం తెలంగాణ నుంచి రావాల్సిన ఆస్తులు కూడా ఇవ్వలేదని ఎన్నికల సభల్లో విరుచుకుపడుతున్నారు. వైకాపా ఫ్యానుకు… కరెంటు..ఢిల్లీలో ఉంటే .. స్విచ్చు.. కేసీఆరే నంటూ.. వైకాపా తెరాసకు బీ-టీమ్ అనే ప్రచారాన్ని జనంలోకి తీసుకెళ్లారు.

మరోవైపు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇదే నినాదాన్ని అందుకున్నారు. కేసీఆర్​ పేరును లేవనెత్తి జగన్​పై వాగ్బాణాలు సంధిస్తున్నారు. ఆంధ్రావాళ్లపై దాడులు జరుగుతున్నాయని, అది తెలంగాణా లేక పాకిస్థానా అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే దుమారం రేపాయి. ఎవరు ఎన్ని చెప్పినా అయిదేళ్ల క్రితం జరిగిన రాష్ట్ర విభజన గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయన్నది కాదనలేని వాస్తవం.

నేటికీ నెరవేరని హామీలు, పూర్తి కాని ఆస్తుల పంపకాలు ఒక పక్క.. కేంద్రం, పొరుగు రాష్ట్రం తీరు మరొకపక్క అందరి నోట నలుగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఆత్మగౌరవ నినాదం అనేది ప్రాంతాలు… వర్గాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే అంశం. ఎన్నికల సందర్భంలో తెరాసతో బహిరంగ దోస్తీ.. అనే సాహసాన్ని వైకాపా చేయలేదు. అదే సందర్భంలో తెదేపా.. వైకాపా నుంచి వస్తున్న వాక్బాణాలను కాచుకోవలసిన పరిస్థితి… ఈ క్రమంలోనే తెరాసతో కలిస్తే తప్పేంటని జగన్ వ్యాఖ్యానించారు.

దీనిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. జగన్ ఈ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే తెరాస పోలవరం ఆపాలంటూ.. సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీంతో ఎన్నికల వేళ సహజంగానే సెంటిమెంట్ రాజుకుంది. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. ఏ పార్టీ ఏంటన్నది ప్రజలకు ఇప్పటికే ఓ అవగాహన వచ్చింది. ఇక ఓటర్ల తీర్పే మిగిలింది.