దక్షిణాదిలో బీజేపీకి గడ్డుకాలం… పని చేయని సర్జికల్ స్ట్రైక్స్

0
44
bjp logo
bjp logo

సంప్రదాయకంగా బీజేపీకి ఉత్తరాది పార్టీ అని పేరు. దక్షిణాదిలో ఒక్క కర్ణాటక మినహా వేరెక్కడా ఆ పార్టీకి పూర్తిస్థాయి బలం లేదు. ఫలితంగా చాలా సార్వత్రిక ఎన్నికల్లో కమలదళం దక్షిణాదిన చతికిలబడుతూనే వచ్చింది. ఈ దఫా కూడా ఇది పునరావృతమయ్యే అవకాశం ఉంది.

పుల్వామా ఉగ్రదాడికి ప్రతిగా పాక్‌లోకి చొరబడి భారత్‌ జరిపిన వైమానిక దాడులతో ప్రజల్లో ఉప్పొంగిన భావోద్వేగాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడంలో హిందీ రాష్ట్రాల్లో బీజేపీ ఒకింత విజయవంతమయ్యే అవకాశమున్నా – ప్రాంతీయ పార్టీల ఖిల్లాలుగా ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో అది ఉపకరించట్లేదని సర్వేలు ఘోషిస్తున్నాయి.

కమల వికాసానికి ఊపిరులూదే సానుకూల పవనాలేవీ మచ్చుకు కూడా కానరావడం లేదు. కాషాయ దళం అగ్రతాంబూలమిచ్చే హిందూ జాతీయవాద నినాదానికీ ఓట్లు రాలే పరిస్థితులు లేవు. హిందూత్వ మంత్రమూ ఇక్కడ అంతగా పనిచేయదు. దీంతో- 2014 లోక్‌సభ ఎన్నికలతో పోల్చితే ఈసారి దక్షిణాదిలో బీజేపీ సీట్ల సంఖ్య సగానికి తగ్గొచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్, కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీకి చావుదెబ్బతిననుంది. కర్ణాటకలో కాస్తోకూస్తో బలం ఉంది. అయితే, అక్కడ కాంగ్రెస్ – జేడీఎస్‌లు ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి. ఇకపోతే, తమిళనాడు రాష్ట్రంలో అధికార అన్నాడీఎంకేతో బలవంతపు పొత్తు పెట్టుకుంది. తమిళనాడు బీజేపీ కారణంగా అన్నాడీఎంకే కూడా చిత్తుగా ఓడిపోయే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉందని చెప్పొచ్చు. గతంలో టీడీపీతో పొత్తు ఉన్న సందర్భాల్లో మాత్రమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ బోణీ కొట్టింది. ఇప్పుడు టీడీపీ దూరమయ్యింది. తెరాసతో లోపాయికారీ పొత్తుందన్న ప్రచారం ఆ పార్టీని పూర్తిగా దెబ్బతీసింది. ఈ పరిస్థితుల్లో గత ఎన్నికల్లో తెలంగాణ నుంచి నెగ్గిన ఒక స్థానం, ఆంధ్రప్రదేశ్‌లో గెల్చిన రెండు స్థానాల్లో విజయాన్ని పునరావృతం చేయడం అంత సులభం కాదు.

మరోవైపు మైనారిటీ ఓట్లు దూరమవుతాయనే భయంతో ఏపీలో వైఎస్సార్‌సీపీ, తెలంగాణలో టీఆర్‌ఎస్‌ బీజేపీతో అవగాహన ఉన్నట్లు బాహాటంగా ప్రకటించలేదు. ఎన్నికల ఫలితాల తర్వాత పరిణామాలు మారే అవకాశాలున్నప్పటికీ, ఇప్పటికిప్పుడైతే కమలదళంతో కలిసి నడిచేందుకు తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీ కూడా సిద్ధంగా లేదు.

దీంతో దక్షిణాదిలో ఉన్న 130 లోక్‌సభ స్థానాల్లో గత ఎన్నికల్లో బీజేపీ 21 స్థానాలకే పరిమితమైంది. అందులో 17 సీట్లు కర్ణాటక, 3 సీట్లు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, ఒక సీటు తమిళనాడులో నెగ్గింది. ఈ సారి కమళం సీట్లు పూర్తిగా తగ్గిపోవచ్చని అంచనాలు లేకపోలేదు. మొత్తంమీద దక్షిణాదిలో బీజేపీ అంటరాని పార్టీగా మిగిలిపోయే అవకాశం ఉంది.