దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి ఊపందుకున్న నేపథ్యంలో.. తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎన్నికల నేపథ్యంలో విచిత్రాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో భార్యాభర్తలు ప్రత్యర్థుల్లా బరిలో దిగడం అందరికీ షాకివ్వడమే కాకుండా.. చర్చనీయాంశంగా మారింది.
ఈ క్రమంలో మాజీ మంత్రి కొలుసు పార్థసారథి వైసీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తుండగా, ఆయన అర్ధాంగి కమల ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచారు. కమలకు ఎన్నికల సంఘం బెల్టు గుర్తు కేటాయించింది. పెనమలూరు నుంచి ఈసారి పదిమందికి పైగా బరిలో ఉన్నారు. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, వైసీపీ నుంచి పార్థసారథి, జనసేన మద్దతిస్తున్న బీఎస్పీ అభ్యర్థి లంక కమలాకర్ రాజు ప్రధానంగా కనిపిస్తున్నారు.
కాగా, పార్థసారథి, ఆయన భార్య కమల మాత్రమే కాకుండా కుమారుడు నితిన్ కృష్ణ కూడా నామినేషన్ వేసినా, స్క్రూటినీ సమయంలో తిరస్కరణకు గురైంది. లేకుంటే భార్యాభర్తలు ప్రత్యర్థులుగా బరిలోకి దిగేవారు.