ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఐపీఎస్ అధికారుల బదిలీకి ఎలాంటి కారణాలు అక్కర్లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. సాధారణ రోజుల్లో బదిలీ జరిగితేనే ప్రభుత్వం ఎలాంటి కారణాలు చెప్పదని గుర్తు చేశారు.
ఇంటెలిజెన్స్ చీఫ్‌తో పాటు రెండు జిల్లాల ఎస్పీలను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. దీన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ఈసీ లేఖ కూడా రాశారు. దీనిపై ఆయన మాట్లాడుతూ, ఉద్యోగులకు బదిలీలు, సస్పెన్షన్లు శిక్ష కాదనే విషయాన్ని గుర్తించాలని ద్వివేది అన్నారు.
బదిలీ నిర్ణయం తీసుకున్నది కేంద్ర ఎన్నికల సంఘం అయితే.. తనకు లేఖ రాసి ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. కొన్ని పార్టీల గుర్తులు ఒకేలా ఉన్నాయన్న ఆరోపణలు వస్తున్నాయన్న ద్వివేది.. గుర్తులు మార్చడమనేది వీలు కాదని స్పష్టంచేశారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్‌కు భద్రతపెంచాలని పోలీసులకు సూచించినట్లు తెలిపారు. జగన్ బెయిల్ రద్దు విషయం తమ పరిధిలో లేదని ఆయన చెప్పారు.
అందుకు కోర్టును ఆశ్రయించాలని సూచించారు. ముందస్తు జాగ్రత్తగా రాష్ట్రంలో వేలమందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. నేటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిందని ఈసీ చెప్పారు. ఐటీ గ్రిడ్ వ్యవహారంలో సిట్ అధికారులు అడిగిన అన్నింటికీ వివరణ ఇచ్చామని ద్వివేది చెప్పారు.