రోబోకు మోడీకి తేడా లేదు : చంద్రబాబు నాయుడు

0
34

ప్రధాని నరేంద్ర మోడీపై ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మోడీని ఓ రోబోగా అభివర్ణించారు. మోడీకి, రోబోకి తేడా ఏముందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోడీకి పిల్లలు ఉంటే ఇలా మాట్లాడరని అన్నారు. మోడీకి వ్యక్తిత్వమే లేదని ఆరోపించారు.

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ, ఆంధ్రప్రదేశ్‌ను సన్‌రైజ్ స్టేట్ అంటూ వక్రభాష్యాలు చెబుతున్నారని, ఏనాడైనా కుటుంబం, అనుబంధాల గురించి తెలిస్తే పిల్లలపై ఉండే వాత్సల్యం కూడా తెలుస్తుందని విమర్శించారు.

“ప్రధానికి ఇష్టంవచ్చినట్టు మాట్లాడడం తప్ప బంధాల గురించి ఏం తెలుసు? ఆయనొక మరమనిషి. విలువలతో కూడిన రాజకీయాలు చేయడం తెలియదు. ఏపీకి ఎంతో చేశామని చెబుతున్నారు, విభజన చట్టంలో ఉన్నవే ఇచ్చారు తప్ప ప్రత్యేకంగా ఏమీ ఇవ్వలేదు. ఆనాడు రాష్ట్ర విభజన తర్వాత 7 మండలాలను ఏపీలో కలపకపోతే ప్రమాణం చేయనని చెప్పాను. పోలవరం ప్రాజక్టుకు ఇప్పటికీ కేంద్రం రూ.4,500 కోట్లు ఇవ్వకుండా తాత్సారం చేస్తోంది. పెట్రో కెమికల్ కారిడార్ ఇవ్వకుండా మోసం చేస్తే కాకినాడలో ప్రైవేటు సంస్థతో పెట్రో కారిడార్ ఏర్పాటు చేసుకున్నాం. కడప స్టీల్ ప్లాంట్ విషయంలోనూ ఇలాగే వ్యవహరించారు. ఆఖరికి విశాఖ రైల్వే జోన్ ఇస్తున్నామంటూ తల లేని మొండెం ఇచ్చారు. ఆదాయంలేని రైల్వే జోన్ ఎందుకు?” అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.

అంతకుముందు కర్నూలు సభలో మోడీ మాట్లాడుతూ, ఏప్రిల్ 11 తర్వాత రాష్ట్రంలో తన పుత్రోదయం కోసం ఎదురుచూస్తున్న వ్యక్తి ఆశలకు అస్తమయం తప్పదని చంద్రబాబుపై పరోక్ష వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. వీటికి కౌంటరిస్తూ చంద్రబాబు పై విధంగా వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా, అసలు ఎందుకొచ్చారు మీరిక్కడికి? అంటూ ప్రధానిని ప్రశ్నించారు. విభజన తాలూకు గాయాలు ఇంకా మానలేదని అన్నారు. మేం ఈ దేశంలో పౌరులం కాదా? మేం పన్నులు కట్టడం లేదా? కేంద్రం సహకరించకపోయినా, తెలంగాణ లక్ష కోట్ల వాటా ఇవ్వకపోయినా, ప్రజల సహకారంతో ముందుకెళతాం అంటూ సమరోత్సాహం ప్రదర్శించారు.

“నరేంద్ర మోడీగారూ మా ప్రజలు చెప్పేది వినండి! నేను చెప్పడం కాదు, మా ప్రజల నోటి వెంట వినండి, నేను చేసిన అభివృద్ధి ఏంటో. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఈ ఐదేళ్ల కాలంలో నాకొచ్చిన ఆనందం ఎప్పుడూ చూడలేదు. మీరు ఢిల్లీలో కానీ, తెలంగాణలో కానీ సంక్షేమ కార్యక్రమాలు ఏమైనా చేశారా? లేదే! మొన్న ఓ వృద్ధురాలు వేదికపైకి వచ్చి నా పెద్ద కొడుకు వచ్చాడు అంటూ మురిసిపోయింది. వృద్ధుల్లో కూడా ఆత్మవిశ్వాసం కలిగేలా సంక్షేమ పథకాలు తీసుకువచ్చాం, అధికారం, పెత్తనం తప్ప ఇవన్నీ నరేంద్ర మోడీకి అర్థంకావు. ఆయన చౌకీదార్ నంటూ ప్రజలను మోసం చేస్తున్నాడు. అవినీతిపరులకు కాపలాదారుడు. నీతిపరులను వెంటాడే ఈ నరేంద్ర మోడీ ఓ పనికిరాని వ్యక్తి” అంటూ ఆరోపించారు.