మాజీ మంత్రి, వైసీపీ నేత వివేకానందరెడ్డి హత్య కేసులో ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, పీఏ కృష్ణారెడ్డి, ఇంట్లో పనిచేసే లక్ష్మీ కుమారుడు ప్రకాష్‌లు వున్నారు. హత్య జరిగిన రోజు ఘటనా స్థలంలో సాక్ష్యాలను తారుమారు చేసినందుకు ఈ ముగ్గుర్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
బాత్‌రూమ్‌లో ఉన్న వివేకా మృతదేహాన్ని వీరు బెడ్‌రూమ్‌కి తరలించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో ఎర్ర గంగిరెడ్డి అక్కడే ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. వివేకా పీఏ కృష్ణారెడ్డికి వివేకా రాసిన లేఖ దొరికానా, సాయంత్రం వరకు దాన్ని పోలీసులకు ఇవ్వలేదనే కారణంతో పోలీసులు ఆయన్ని అరెస్టు చేశారు.
పోలీసులు చెబుతున్న దాన్ని బట్టి ఈ నెల 15న ఉదయం 8 గంటల సమయంలో వివేకానంద రెడ్డి పీఏ కృష్ణారెడ్డి పులివెందుల పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. వివేకానందరెడ్డి చనిపోయారని ఫిర్యాదు చేశారు. సదరు ఫిర్యాదుపై పులివెందులలో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు.
తర్వాత శవపంచనామా సమయంలో సాక్ష్యాలు, రక్తపు మరకలు, బంధువుల చెప్పిన దానని బట్టి హత్యకేసుగా మార్చారు. దీని మీద రాజకీయ కలకలం రేగడంతో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్)ని ఏర్పాటు చేసింది. ఆ బృందం చేసిన దర్యాప్తులో భాగంగా తేలిన విషయాలు ఏంటంటే వైఎస్ వివేకానందరెడ్డి మృతదేహాన్ని స్నానాల గది నుంచి బెడ్‌రూమ్‌లోకి తరలించారు.
బెడ్‌రూమ్‌లో ఉన్న రక్తపు ఆనవాళ్లను చెరిపేసి సాక్ష్యాధారాలను తారుమారు చేశారు. పోలీస్ అధికారుల దర్యాప్తు చేపట్టక ముందే వివేకానందరెడ్డి శవాన్ని చాలా ఇంటి నుంచి అంబులెన్స్‌లో పులివెందుల గవర్నమెంట్ ఆస్పత్రి మార్చురీ గదికి మార్చారు.
వివేకా హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేసిన వారిపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. వివేకా హత్యకేసును దర్యాప్తు చేస్తున్న సిట్ 12 రోజుల పాటు 50మందికి పైగా సాక్షులను పోలీసులు విచారించి మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు.