నా సైకిల్‌ బుల్లెట్‌… ఎదురుపడితే మటాష్ : చంద్రబాబు

0
65

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనదైనశైలిలో ఎన్నికల ప్రచారంసాగిస్తున్నారు. 70యేళ్ల వయసులోనూ ఆయన కుర్రాడిలా ప్రచారం చేస్తున్నారు. తన ప్రసంగాల్లో మధ్యలో చమత్కారాలు, ఛలోక్తులు విసురుతూ సభికులను బాగా నవ్విస్తున్నారు.

శుక్రవారం రాజమండ్రి రోడ్ షోలో కూడా చంద్రబాబు జనసేనాని పవన్ కల్యాణ్ పై ఓవైపు విసుర్లు, మరోవైపు వ్యంగ్యం కురిపించారు. తాను లక్ష రూపాయలిచ్చి ఆడబిడ్డలను అత్తారింటికి పంపిస్తున్నానని చెప్పారు.

ఈ క్రమంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అత్తారింటికి దారేది సినిమా తీశారని గుర్తుచేశారు. తాను అందరినీ అత్తారింటికి పంపిస్తుంటే, పవన్ కల్యాణ్ మాత్రం ఆయన దారి ఆయన వెతుక్కుంటూ వెళుతున్నారని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా, పవన్ చేసిన కొన్ని వ్యాఖ్యలను ప్రస్తావించారు. చంద్రబాబు సైకిల్ చెయిన్‌ను కేసీఆర్ తెంపేశారని, ఇక సైకిల్ నడవడంలేదని పవన్ అనడం పట్ల తనదైన శైలిలో స్పందించారు.

తన సైకిల్‌ను ముట్టుకునే ధైర్యం ఎవరికీ లేదని అన్నారు. “నా సైకిల్‌ను తాకితే షాక్ తింటారు, నా సైకిల్ తాకి నిలబడగలరా వీళ్లు? సైకిల్ నుంచి కూడా కరెంట్ తయారవుతుంది. అది మామూలు కరెంట్ కాదు. అంత స్పీడుగా వెళుతుంది నా సైకిల్ బుల్లెట్ మాదిరిగా. ఎవరైనా తాకితే అక్కడితో మటాష్ అంటూ వ్యాఖ్యానించారు.