ఏపీలో ముక్కోణపు పోటీ : మహిళల చేతుల్లో పార్టీల భవితవ్యం

0
75

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ముక్కోణపు పోటీ నెలకొంది. టీడీవీ, వైకాపా, జనసేన పార్టీల మధ్య తీవ్రస్థాయిలో పోటీ ఏర్పడివుంది. వీరి భవితవ్యం మహిళా ఓటర్ల చేతిలో నిక్షిప్తమై వుంది.

నవ్యాంధ్రప్రదేశ్ ఓటర్లలో పురుషుల కంటే మహిళలే అధికంగా ఉన్నారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన తాజా జాబితాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో…138 చోట్ల పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉండటం చూస్తే మహిళా ఓటర్ల ఓట్లు ఎంత కీలకమో మరి చెప్పాల్సిన పనిలేదు.

తాజా ఓటర్ల జాబితా ప్రకారం…రాష్ట్రంలో పురుష ఓటర్లు 1,94,62,339 మంది ఉంటే మహిళా ఓటర్లు 1,98,79,421 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళలే 4,17,082 మంది ఎక్కువగా ఉన్నారు. అంతేకాదు రాష్ట్రంలోని 138 అసెంబ్లీ స్థానాలలో మహిళా ఓటర్లు నిర్ణాయకపాత్రను పోషించబోతున్నారు.

దీంతో రాజకీయపార్టీల నేతలంతా ఆడపడుచులు, పసుపుకంకాలూ అంటూ సెంటిమెంట్‌తో ఆకట్టుకోడానికి తంటాలు పడుతున్నారు. ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగే టీ-20 క్రికెట్ మ్యాచ్ తరహాలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమరం జరుగుతోంది. మూడుపార్టీల ముక్కోణపు పోరులో ప్రతిఓటూ కీలకమే.

మహిళా ఓటర్ల అభిమానం చూరగొన్న పార్టీలే విజేతగా నిలవడం, అధికారం దక్కించుకోడం మనం చూస్తున్నదే. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సైతం మహిళల ఓట్లే అధికారాన్ని నిర్ణయించడంలో కీలకం కాబోతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే మహిళల దయాదాక్షిణ్యాల పైనే ఏపీ పార్టీల జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి.

ముఖ్యంగా, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాలలో పురుషుల కంటే మహిళా ఓటర్ల ఆధిపత్యమే కొనసాగుతోంది. దీంతో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ, జనసేనపార్టీలు మహిళా ఓటర్లను ఆడపడుచులు, అక్కచెల్లెళ్లు, పసుపుకుంకాలు అంటూ ఆ కట్టుకోడానికి నానాపాట్లు పడుతున్నారు. ఈ ఎన్నికల్లో మాత్రం మహిళా ఓటర్లు ఎవరికి జైకొడతారో వారికే అధికారం అనడంలో ఏమాత్రం సందేహం లేదు.