కేసీఆర్ తంతే చంద్రబాబు పారిపోయాడు: మోత్కుపల్లి

0
50

తెలంగాణ ప్రాంతానికి చెందిన టీడీపీ మాజీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు. టీటీడీపీ నుంచి తప్పుకున్న ఇతర నేతల్లాగానే మోత్కుపల్లి కూడా తరచుగా చంద్రబాబునాయుడిపై మాటల దాడి చేస్తున్నారు.

తాజాగా ఆయన చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దళితుడిని అయిన తాను ఎన్టీఆర్ హయాంలో మంత్రినయ్యానని, కానీ చంద్రబాబులాంటి దుర్మార్గుడు ఎన్టీఆర్ అల్లుడిగా వచ్చి వెన్నుపోటు పొడిచాడని ఆరోపించారు. గ్రహాలు తొమ్మిదే అయినా పదో గ్రహంగా చంద్రబాబు పేరు చెప్పుకోవాలని, నక్కజిత్తులవాడు అని పేర్కొన్నారు.

ఓటుకు నోటు కేసులో కేసీఆర్ తంతే పారిపోయిన పిరికిపంద చంద్రబాబు అని విమర్శించారు. నువ్వు నీతిమంతుడివే అయితే 29 కేసుల్లో ఎందుకు స్టే తెచ్చుకున్నావు? అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా కనుమరుగైపోయిందని, ఏపీలో కూడా చంద్రబాబును ఓడించి శని వదిలించుకోవాలని పిలుపునిచ్చారు.

చంద్రబాబు వల్ల ఏపీకి ప్రత్యేక హోదా రాదని, కేసీఆర్ లేఖ రాస్తేనే ప్రత్యేక హోదా వస్తుందని మోత్కుపల్లి తెలిపారు. 70 ఏళ్ల వయసున్న చంద్రబాబు తాను అందరికీ పెద్దకొడుకునని చెప్పుకుంటున్నాడని, సరిగ్గా చెప్పాలంటే చంద్రబాబు పెద్దకొడుకు కాదు పెద్ద తాత అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు సభల్లో ప్రసంగాలు వింటున్నవాళ్లకు చెవుల నుంచి రక్తాలు కారుతున్నాయంటూ మోత్కుపల్లి వ్యంగ్యం ప్రదర్శించారు