సింహపురి సింహాల సమరంలో గెలుపు ఎవరిదో?

0
50

నెల్లూరు అనగానే రాజకీయంగా ఎంతో చరిత్ర, పరిణతి కలిగిన ప్రాంతం. కోట్లకు పడగలెత్తిన అభ్యర్థులు కొదమసింహాల్లా తలపడే సింహపురి సమరం. ప్రస్తుత ఎన్నికల్లో సైతం నెల్లూరు పార్లమెంట్ స్థానం ఓ ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమైంది. మూడుదశాబ్దాల స్నేహ, ఆర్థిక బంధాలను పక్కన పెట్టి గురు శిష్యులే సమరానికి సై అంటున్నారు. కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఇంతకీ ఆ గురు శిష్యులు ఎవరన్నదే కదా మీ సందేహం. అయితే, ఈ కథనం చదవండి.

ఏ నిముషానికి ఏమి జరుగునో అన్న మాట మన రాజకీయరంగానికి అతికినట్లు సరిపోతుంది. ఎవరికి ఎవరు ఎందుకు ప్రత్యర్థిగా మారుతారన్నది కూడా నాటకీయంగా జరిగిపోతుంది. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాలకే విలక్షణమైనదిగా పేరుపొందిన నెల్లూరు స్థానం నుంచి జరిగే మహా సమరానికి గురుశిష్యులే పోటీపడుతున్నారు.

వారు ఎవరో కాదు.. ఆదాల ప్రభాకర్ రెడ్డి. వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బీద మస్తాన్ రావు. టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. వీరిద్దరి రాజకీయ జీవితం ఒకేబాట అన్నట్లుగా సాగింది. కానీ, ఒకే ఒక్క రోజులోనే రాజకీయప్రత్యర్థులుగా మారిపోయారు. తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆదాల ప్రభాకర్ రెడ్డి అనూహ్యంగా వైసీపీ కండువా కప్పుకోడంతో నెల్లూరు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

నెల్లూరు పార్లమెంట్ స్థానానికి ఆదాలను తమ అభ్యర్థిగా వైసీపీ ప్రకటించడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడిన అధికార టీడీపీ ఆ వెంటనే తేరుకొని ఆదాల అనుచరుడు బీద మస్తాన్ రావు‌ను తమ అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా సంచలనమే సృష్టించింది. ఆదాల ప్రభాకర్ రెడ్డి, బీద మస్తాన్ రావు జోడీ రాజకీయంగా, వ్యాపారపరంగా నిన్నమొన్నటి వరకు గురుశిష్యులుగా ఉండేవారు.

ఒకరు పార్టీలు మారుతున్న మరోకరు మాత్రం ఒకేపార్టీలో ఉన్నా వారిద్దరి మధ్య స్నేహబంధం.. పరస్పర అవగాహన గత మూడు దశాబ్దాలుగా చెక్కు చెదరకుండా ఉంది. కానీ పార్లమెంట్ ఎన్నికల పుణ్యమా అంటూ వారిద్దరూ రాజకీయ ప్రత్యర్దులయ్యారు. ఒకరు టీడీపీ నుంచి అనుహ్యంగా పార్లమెంట్ బరిలోకి దిగితే మరొకరు అధికార టీడీపీ నుంచి అధినేత ఆదేశానుసారం విధిలేని పరిస్థితుల్లో పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

టీడీపీ అభ్యర్థి బీద మస్తాన్ రావు తమ పార్టీ ఆవిర్భావం నుంచి ఓ సామాన్య కార్యకర్తగా తన జీవితం ప్రారంభించి ఎమ్మెల్యే స్థాయి నాయకుడిగా ఎదిగారు. కాగా టీడీపీ మాజీ, వైసీపీ ప్రస్తుత అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఓ నిర్మాణ సంస్థ అధినేతగా మంచి పేరుంది. 1994లో ఆదాలను రాజకీయాలకు పరిచయం చేసిన ఘనత బీద సోదరులు మస్తాన్ రావు, రవిచంద్రలకు మాత్రమే దక్కుతుంది.

ఆదాల ప్రభాకర్ రెడ్డి టీడీపీ నుంచి అల్లూరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అక్కడ విజయం సాధించిన అనంతరం ఆయన రాష్టమంత్రిగానూ పనిచేశారు. ఆదాల రాజకీయంగా ఆరంగ్రేటం చేసినప్పటికీ వయసులో చిన్నవారైన మస్తాన్ రావు సోదరులు ఆదాలకు అనుచరులుగా కొనసాగారు. ఆదాలను వ్యాపార రాజకీయ రంగాల్లో తమ గురువుగా భావించారు. ఒకటి, రెండుసార్లు ఆదాల పార్టీ మారినా బీదా సోదరుల్లో పెద్దవారైన మస్తాన్ రావు మాత్రం ఆదాలకు అనుచరుడుగానే కొనసాగుతూ వచ్చారు అయితే… ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం గురుశిష్యులే నెల్లూరు పార్లమెంట్ స్థానంలో ప్రత్యర్థులుగా మారారు.

30యేళ్ల రాజకీయాల్లో ఆదాల, బీదా ఇద్దరూ ఆర్థికంగా అపరకుబేరులయ్యారు. ఒకరు నిర్మాణ సంస్థ ఏపీఆర్‌తో కోట్ల రూపాయలకు అధినేత కాగా, మరొకరు బిఎంఆర్ గ్రూప్ ఆప్ ఇండ్రస్టీస్ పేరుతో దేశమే కాదు ప్రపంచ స్థాయి ఆక్వారంగ నిపుణుడిగా, ఆర్థిక వేత్తగాఎదిగారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నదానికి నిదర్శనమే ప్రస్తుత ఈ గురుశిష్యుల సమరం. సింహపురి సింహాల సమరంలో గెలుపెవ్వరిందో నిర్ణయించాల్సింది మాత్రం ఓటరు దేవుళ్లు మాత్రమే.