ప్రముఖ నటి అమీ జాక్సన్ పెళ్లి కాకుండానే తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జార్జ్ పనాయొటోతో ఆమె గత కొన్ని నెలలుగా డేటింగ్‌లో ఉన్నారు.
న్యూ ఇయర్ సందర్భంగా వీరిద్దరికీ జాంబియాలో నిశ్చితార్థం అయింది. అయితే పెళ్లి మాత్రం ఇంకా చేసుకోలేదు. కానీ తాను తల్లి కాబోతున్నానంటూ, ఈ విషయాన్ని అభిమానులతో పంచుకోవడానికి మాతృదినోత్సవానికి మించిన సరైన రోజు మరొకటి లేదని వెల్లడించింది.
బ్రిటన్‌లో నేడు మదర్స్ డే కావడంతో అమీ ఈ విషయం అందరితో పంచుకుంది. కాబోయే భర్తతో దిగిన ఫోటోను షేర్ చేసిన అమీ, ‘మీ అందరికీ ఈ విషయాన్ని అరిచి మరీ చెప్పాలని ఎదురుచూస్తున్నాను. ఈ విషయం చెప్పేందుకు మాతృదినోత్సవానికి మించిన సరైన రోజు మరొకటి ఉండదు.
ఈ ప్రపంచంలో అందరి కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్ను చూసేందుకు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాం’ అని పోస్ట్ చేసింది. పోస్ట్ చూసిన నెటిజన్లు, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.