విశాఖ పట్టణం వేదికగా ప్రధాని నరేంద్ర మోడీకి వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బహిరంగ సవాల్ విసిరారు. విశాఖలో జరిగిన టీడీపీ ఎన్నికల ప్రచార సభకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీని ఏకిపారేశారు.
నరేంద్ర మోడీ కారణంగా దేశం నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. దేశానికి మోడీ, అమిత్ షాల అవసరంలేదని, వారి వల్ల దేశానికి ఒరిగిందేమీలేదని మండిపడ్డారు. తన ఐదేళ్ల పాలనలో మోడీ ఐటీ దాడులు మాత్రం చేయించగలిగారని విమర్శించారు. నోట్ల రద్దు వల్ల తీవ్రవాదం తగ్గిపోతుందని చెప్పారు, కానీ అది జరిగిందా? అని ప్రశ్నించారు.
దమ్ముంటే ప్రధాని మోడీ తనతో చర్చకు రావాలని, పేపర్లు, టెలీప్రాంప్టర్లు లేకుండా చర్చకు కూర్చోవాలని మమత ఈ సందర్భంగా సవాల్ విసిరారు. మోడీకి ఈ ఎన్నికలే చివరివని, బీజేపీకి 125 సీట్లకు మించి రావని జోస్యం చెప్పారు. మోదీతో రాజకీయ యుద్ధానికి తాను సిద్ధంగా ఉన్నానని దీదీ సభాముఖంగా స్పష్టం చేశారు.