‘ఆ నలుగురు’ నా శవాన్ని మోసేవరకు జనసేన పార్టీని మోస్తాను: పవన్ కళ్యాణ్

0
31

తాను సుదీర్ఘ ప్రణాళికతోనే రాజకీయాల్లోకి వచ్చానని, ఈ ఎన్నికలతోనే అంతా అయిపోతుందని భావించడంలేదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ముఖ్యంగా, నలుగురు వ్యక్తులు వచ్చిన తన శవాన్ని మోసే వరకు తాను జనసేన పార్టీని మోస్తూనే ఉంటానని ఆయన చెప్పారు.

తన ఎన్నికల ప్రచారంలో భాగంగా, సోమవారం తణుకు శంఖారావం సభలో మాట్లాడుతూ, టీడీపీ, వైసీపీలను టార్గెట్ చేశారు. టీడీపీ, వైసీపీలతో కలవాల్సిన దుస్థితి తమకు పట్టలేదన్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తే ఉభయగోదావరి జిల్లాల తెలుగుదేశం నేతలకు మర్యాద దక్కదని పవన్ హెచ్చరించారు.

పైగా, సైకిల్ చైన్ ఎప్పుడో తెంపేశామని, ఇంకా ఆ పార్టీ నాయకులు పనికిమాలిన ప్రచారాలు చేయడంలో అర్థంలేదన్నారు. రాష్ట్ర ప్రజలు రాజకీయాల్లో మార్పు కోరుకుంటున్నారని, అందుకే చంద్రబాబునాయుడుకు వృద్ధాప్య పెన్షన్ ఇచ్చి రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ఇవ్వాలని సూచించారు.

తాను సుదీర్ఘ ప్రణాళికతోనే రాజకీయాల్లోకి వచ్చానని, ఈ ఎన్నికలతోనే అంతా అయిపోతుందని భావించడంలేదని పవన్ కల్యాణ్ స్పష్టంచేశారు. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత జైలుకు వెళ్లడానికి తనపై జగన్‌లా అక్రమాస్తుల కేసులు లేవని, చంద్రబాబులా ఓటుకు నోటు కేసు లేదని సెటైర్ వేశారు.

ప్రజలు తన ఫొటో ఇళ్లలో పెట్టుకోవాలని జగన్ కోరుకుంటున్నారని, రెండేళ్లు జైలుకు వెళ్లొచ్చిన ఆయన ఫొటోలు ఎలా పెట్టుకుంటారు? అని పవన్ ప్రశ్నించారు. పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ, తండ్రి మృతదేహం పక్కనున్నా అధికారం కోసం జగన్ తాపత్రయ పడ్డారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ‘జనసేన’ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో వాటిని భర్తీ చేస్తామని, లక్ష ఎకరాల భూమి సేకరించి లక్ష మంది యువరైతులను తయారు చేస్తానని హామీ ఇచ్చారు. యువతకు పెద్ద చదువులు అక్కర్లేదని, కష్టపడే తత్వం ఉంటే చాలని, పదో తరగతి పాసైన యువతను స్పెషల్ ఫోలీస్ కమాండోస్‌గా నియమిస్తామని, తమ పార్టీ అధికారంలోకి వచ్చాక పావలా వడ్డీకే బ్యాంకు రుణాలు ఇస్తామన్నారు.

స్వచ్ఛ భారత్ కోసం తన ఫొటోలు కావాలని బీజేపీ నేతలు అడిగారని, ఫొటోల కోసం డ్రామాలు ఆడలేనని వారికి చెప్పిన విషయాన్ని పవన్ గుర్తుచేసుకున్నారు. రాజకీయాల్లో ఉన్న చెత్తను ఊడ్చేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని మరోసారి స్పష్టం చేసిన పవన్, తనకు పార్టీల కంటే సమాజం అంటేనే ఎక్కువ ఇష్టమని చెప్పడం గమనార్హం.