అధికార తెలంగాణ రాష్ట్ర సమితి, ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిప్పులు చెరిగారు. కారు తుప్పుపట్టిపోయిందన్నారు. అయినప్పటికీ కారు స్టీరింగ్ మజ్లీస్ చేతిలో ఉందని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ, ‘కారు’ టీఆర్ఎస్‌దే అయినా, స్టీరింగ్ మాత్రం మజ్లిస్ పార్టీ చేతిలో ఉందని విమర్శించారు. ‘ఆర్నెళ్లు సావాసం చేస్తే వారు వీరవుతారు’ అన్నట్టు, మజ్లిస్ పార్టీతో సావాసం కారణంగా టీఆర్ఎస్ కూడా ప్రజల గురించి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
పాతబస్తీకి మెట్రో రైలు తీసుకొస్తామంటే మజ్లిస్ అడ్డుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మోడీ ప్రస్తావించారు. మజ్లిస్ పార్టీకి అభివృద్ధి భాష అర్థం కాదని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధికి మజ్లిస్ పార్టీ స్పీడ్ బ్రేకర్ లాంటిదని నిప్పులు చెరిగారు.
హైదరాబాద్‌లో మూసీ నదికి ఒకవైపు మాత్రమే అభివృద్ధి చేస్తున్నారని విమర్శించారు. కుటుంబ పాలనతో తెలంగాణ ప్రజలు నష్టపోతున్నారని అన్నారు. హైదరాబాద్ మెట్రో, ఢిల్లీ మెట్రోతో పోటీపడుతోందని, రామగుండం కు ఫెర్టిలైజర్ ప్రాజెక్టు, ఫుడ్ పార్క్ మంజూరు చేసిన విషయాన్ని గుర్తుచేశారు.
అంతేకాకుండా, బాంబులతో దద్దరిల్లే దేశం కావాలా? ప్రశాంతంగా ఉన్న ఇప్పటి తరహా భారత్ కావాలా? అని ప్రధాని మోదీ ప్రశ్నించారు. యుద్ధ విమానాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కొనేందుకు డబ్బులు లేవని గత పాలకులు అనేవారని, మరి, మోడీ హయాంలో డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయంటూ కాంగ్రెస్ పార్టీపై సెటైర్లు విసిరారు.
ఐదేళ్లు ఈ దేశానికి కాపలాదారుగా ఉన్నానని, ‘దేశానికి ఈ చౌకీదార్ రక్షణ కల్పిస్తారా లేదా అన్న విషయాన్ని మీరే ఆలోచించాలి’ అని ప్రజలను కోరారు. ఈ ఐదేళ్లలో అసాధ్యాలను సుసాధ్యం చేశామని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు.