నా బిడ్డ సింహంలాంటోడు : వైఎస్. విజయమ్మ

0
40

తన బిడ్డ వైఎస్. జగన్ మోహన్ రెడ్డి సింహంలాంటోడని, ఎవరికాళ్ళమీద పడడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. ఆమె వైకాపా తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.

ఈ సందర్భంగా, శ్రీకాకుళం జిల్లా పొందూరులో ఆమె మాట్లాడుతూ, తన బిడ్డ జగన్ ఎవరికీ కాళ్ల మీదా పడే వ్యక్తి కాదని, జగన్ వ్యక్తిత్వం అలాంటిది కాదని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు పదేపదే జగన్‌ను కేసీఆర్ కాళ్ల వద్ద ఊడిగం చేసుకో అనడం పట్ల విజయమ్మ స్పందించినట్టు పైవ్యాఖ్యల ద్వారా అర్థమవుతోంది.

కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత జగన్‌పై కక్షబూని కేసులు పెట్టారని విజయమ్మ గుర్తుచేశారు. వైఎస్సార్ చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్రకు వస్తానని జగన్ మాటిచ్చాడని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడన్నారు. తమ కుటుంబం కష్టాల్లో ఉన్న ప్రతిసారి అభిమానులే అండగా నిలిచారని, వారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని అన్నారు.

తనపై ఎన్ని కుట్రలు చేసినా జగన్ అప్పుడే భయపడలేదని, ఇప్పుడసలు భయపడడని స్పష్టం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం జగన్ తిండి లేకుండా దీక్షలు చేస్తే, చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా వద్దని ప్రత్యేక ప్యాకేజి తీసుకున్నారని ఆరోపించారు. జగన్ పోరాడబట్టే నేటికీ ప్రత్యేక హోదా అంశం సజీవంగా ఉందని విజయమ్మ వివరించారు.