చంద్రబాబు పగటి వేషగాడు : వైఎస్. షర్మిల

0
47

టీడీపీ అధినేత చంద్రబాబును పగటి వేషగాడిగా వైకాపా మహిళా నేత వైఎస్. షర్మిల వ్యాఖ్యానించారు. చంద్రబాబుది రోజుకో మాట.. పూటకో వేషమని ఆరోపించారు. ఆడపిల్ల పుడితే రూ.25 వేలు, మహిళలకు స్మార్ట్‌ ఫోన్లు ఇస్తానన్నారని, ఇచ్చారా? అని అన్నారు. చంద్రబాబును చూసి ఊసరవెళ్లి కూడా సిగ్గుతో పారిపోతుందని ఎద్దేవా చేశారు.

తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ, చంద్రబాబు 600 హామీలిచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. డ్వాక్రా మహిళలకు ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదని, పసుపు-కుంకుమ పేరుతో మరోసారి మోసం చేయడానికి బాబు సిద్ధమయ్యారన్నారు.

మీ భవిష్యత్‌ తన బాధ్యతని దొంగబాబు చెబుతున్నారని, ఆయన మాటలు నమ్మవద్దని కోరారు. ఈ ఎన్నికలు మన పిల్లల భవిష్యత్‌, ఏపీ అభివృద్ధికి కీలకమని, జగనన్నకు ఓటేసి రాజన్న రాజ్యాన్ని తెచ్చుకుందామని పిలుపునిచ్చారు.

చంద్రబాబు, మోడీ ఇద్దరు కలిసి రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను ఎగ్గొట్టారని షర్మిల మండిపడ్డారు. ఐదేళ్లలో అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారని, డ్రాక్రా మహిళలకు ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదన్నారు. ఎన్నికలు వస్తున్నాయని పసుపు-కుంకుమ అంటూ.. మరోసారి చంద్రబాబు మోసం చేయలనుకుంటున్నారని, ఎవరు మోసపోవద్దని షర్మిల ప్రజలకు సూచించారు.

ఆరోగ్యశ్రీ అటకెక్కించిన చంద్రబాబు.. పేదవాడు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని చెబుతున్నారని, ఆయన కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే ఏ ఆస్పత్రికి వెళ్తారని ప్రశ్నించారు. బాబు వస్తే జాబు వస్తుందన్నారని, ఆయన కొడుక్కి మాత్రమే జాబు వచ్చిందని షర్మిల విమర్శించారు.