వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీకి 25 ఎంపీ సీట్లు కట్టబెట్టినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చి చూపిస్తామని వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తీసుకురావడం తన ఒక్కడి వల్లే సాధ్యం కాదని, 25 ఎంపీ స్థానాల్లో తమ పార్టీని గెలిపిస్తే, తెలంగాణ నుంచి 17 ఎంపీలు తోడైతే కేంద్రంలో హోదాను అడ్డుకోవడం ఎవరి తరం కాదన్నారు.
ఇకపోతే, నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు రావాలంటే బాబు సీఎం పదవి నుంచి తొలగిపోవాలన్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో తన కొడుకు లోకేశ్‌కు మాత్రమే రెండు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు తప్ప, ఉద్యోగాల భర్తీ అనేదే జరగలేదని ఎద్దేవా చేశారు. బాబు వస్తే జాబ్ రాదనీ, బాబు దిగిపోతేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయన్నారు.
వైసీపీ అధికారంలోకిరాగానే 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీతో పాటు పరిశ్రమల్లో స్థానిక యువతకు 75 శాతం ఉద్యోగాలిచ్చే విధంగా చట్టం తీసుకొస్తామని స్పష్టం చేశారు. ప్రతి గ్రామానికి ఓ సచివాలయం ఏర్పాటు చేసి, వాటిలో స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ప్రతి ఏడాది జనవరిలో ఉద్యోగాల క్యాలెండర్‌ను విడుదల చేస్తామన్నారు. బాబు సీఎం పదవి నుంచి దిగిపోతేనే నిరుద్యోగులందరికీ ఉద్యోగాలొస్తాయన్నారు.