చంద్రబాబు దుర్మార్గుడే.. కానీ నూరేళ్లూ బతకాలి : మోహన్ బాబు

0
65
MohanBabu
MohanBabu

ఇటీవల వైకాపా తీర్థం పుచ్చుకున్న సినీ నటుడు మోహన్ బాబు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు దుర్మార్గుడే కావొచ్చూ.. కానీ, ఆయన నిండు నూరేళ్లూ జీవించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.

ఆయన మంగళగిరిలో విలేకరులతో మాట్లాడుతూ, ఎంత దుర్మార్గుడైనా, చంద్రబాబు మరణించాలని తాను కోరుకోవడం లేదని, ఆయన నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు. కానీ, ఆయన ముఖ్యమంత్రి పదవికి తగడని, అబద్ధాలు చెప్పే, మోసాలు చేసే వ్యక్తిని ప్రజలు ఎన్నుకోరాదని సలహా ఇచ్చారు.

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు దాదాపు నాలుగు వేల కిలోమీటర్ల మేరకు నడిచిన ఏకైక రాజకీయ నాయకుడు జగన్ అని… తానిచ్చిన నవరత్నాల హామీలను నిలబెట్టుకుంటాడన్న నమ్మకం తనకుందని అన్నారు. జగన్ నిక్కచ్చిగా ఉండే మనిషని, ఆయన సీఎం కావడం తథ్యమని అభిప్రాయపడ్డారు.

రాజధానిని ఏదైనా బీడు భూములు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో కట్టివుంటే ఎంతో మేలు జరిగుండేదని, కానీ, పచ్చని పొలాల్లో ముందే బినామీల ద్వారా కొనుగోలు చేయించి, అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేసి రైతులను మోసం చేశారని మోహన్ బాబు ఆరోపించారు.

నిత్యమూ జగన్‌ను దొంగ, దొంగ అని ఆరోపించడమే పనిగా పెట్టుకున్న చంద్రబాబుపై 11 కేసులు ఉన్నాయని, వాటిల్లో విచారణ జరగకుండా స్టేలు తెచ్చుకున్న ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఎవరిని మోసం చేసి చంద్రబాబు ఇంత ఆస్తి సంపాదించారని మోహన్ బాబు ప్రశ్నించారు.

పైగా, తనకు చంద్రబాబుతో 40 సంవత్సరాల పరిచయం ఉందని, అతని రక్తంలో అణువణువునా అబద్ధాలు, కుట్రలు నిండిపోయాయని ఆరోపించారు. “తెలుగుదేశం ఎవరిది? నంబర్ వన్ హీరోగా ఉన్నటువంటి ఎన్టీ రామారావుగారు, ఆయన కుమారుడు హరికృష్ణతో కలిసి ట్రావెల్ చేస్తూ, తినీతినక, నిద్రాహారాలు మాని, తెలుగుదేశం అనే పార్టీని స్థాపించి, భారతదేశంలో శభాష్ అనిపించుకున్నారు. ఆ మహానుభావుడు, ఇతని పాదాల పడి కన్యాదానం చేస్తే, ఆ మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ది గ్రేట్ చంద్రబాబునాయుడు. అంతకంటే ఘోరం ఇంకోటి ఉంటుందా?” అని మోహన్ బాబు మండిపడ్డారు.

ఆనాడు తాను కూడా చంద్రబాబును కలిశానని, పార్టీలో లక్ష్మీ పార్వతి ప్రమేయాన్ని తగ్గించేందుకు, ఎన్టీఆర్ నుంచి పదవిని తీసుకుని, తిరిగి ఒకటి రెండు రోజుల్లో ఆయనకే అధికారాన్ని ఇద్దామని తనకు చంద్రబాబు చెప్పాడని అన్నారు. చివరకు అన్న ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించడం వాస్తవమని, భగవంతుని సాక్షిగా కళ్లారా తాను చూశానని మోహన్ బాబు చెప్పారు. అది చంద్రబాబు నైజం. ఆ తరువాత కూడా తాను చంద్రబాబును గెలిపించాలని ప్రచారం చేశానని, ఆపై తనను కరివేపాకులా తీసి పక్కన పడేశారని ఆరోపించారు. ఇప్పుడున్నది ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం కాదని, లాక్కున్న తెలుగుదేశం పార్టీ అని ఆరోపించారు.

ఎన్టీఆర్ కుటుంబాన్ని సర్వనాశనం చేయడంతో పాటు ఆయన కుటుంబాన్ని వాడుకుని పక్కన బెట్టారని, కోట్లాది మంది అభిమానులున్న జూనియర్ ఎన్టీఆర్ విషయంలోనూ అలాగే జరిగిందని ఆరోపించారు. ఈమధ్య కూడా తనకు కూతురితో సమానమైన హరికృష్ణ కుమార్తె సుహాసిని విషయంలోనూ చంద్రబాబు మోసం చేశారని మోహన్ బాబు ఆరోపించారు.