చంద్రబాబు – జగన్‌లకు ఊడిగం చేయాలా? పవన్ కళ్యాణ్

0
38

తాను ఎల్లకాలం టీడీపీ అధినేత చంద్రబాబు, వైకాపా అధినేత వైఎస్. జగన్మోహన్‌లకు ఊడిగం చేయాలా అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న విశాఖపట్టణం జిల్లాలోని గాజువాక, పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం నియోజకవర్గంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రచారం నిర్వహించి, పవన్ పై విమర్శలు చేయాలని వైకాపా నేత విజయసాయిరెడ్డి అన్నారు.

వీటిపై పవన్ స్పందించారు. అసలు, ఎవరేం చేయాలో చెప్పడానికి విజయసాయిరెడ్డి ఎవరు చెప్పడానికి, ఆయన పని ఆయన చూసుకోవాలని హితవు పలికారు. ఏ పార్టీ ఎలా ఉండాలో చెప్పడాని విజయసాయిరెడ్డి, జగన్, చంద్రబాబు ఎవరు చెప్పడానికి? అని ప్రశ్నించారు. పిచ్చిమాటలు మాట్లాడేవారికి కాలమే తగిన సమాధానం చెబుతుందని అన్నారు. చంద్రబాబుకు లేదా జగన్ కు ఊడిగం చేయకపోతే ఎవరినైనా అవకాశవాదిగానే చిత్రీకరిస్తారని, ‘మేము ఏంటో వీళ్లిద్దరికీ చూపిస్తా’ అని పవన్ వ్యాఖ్యానించారు.

పైగా, రాజకీయాల్లో రాణించడం, ఎన్నికల్లో పోటీ చేయడం కేవలం డబ్బున్న వాళ్లే కాదు, చాలా సామాన్యులు కూడా చేయొచ్చని నిరూపిస్తామన్నారు. కష్టాలు, ఆకలి, జీవిత భారం తెలిసిన వాళ్లే రాజకీయనాయకులు కావాలని, అందుకే, అలాంటి అభ్యర్థులనే నిలబెట్టామన్నారు. కష్టపడకుండా ఏదీ రాదని, కష్టాన్ని బలంగా నమ్మే వ్యక్తిని తాను అని స్పష్టం చేశారు.

ఫలానా అభ్యర్థి ‘డమ్మీ అభ్యర్థి’ అని ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. పీహెచ్‌డి లేదా సీఏ చదివిన కుర్రాళ్లను లేదా కార్యకర్త నుంచి నాయకుడిగా ఎదిగిన వ్యక్తిని ‘డమ్మీ అభ్యర్థి’ అంటూ అహంకారపూరితంగా ఎలా మాట్లాడతారని, ఎవరైనా సరే, ఆ పద ప్రయోగాన్ని మార్చుకోవాలని సూచించారు. పోటీ చేసే అభ్యర్థులకు వేల కోట్లు ఉండాలా? ఉన్నత కులానికి చెందిన వారై ఉండాలా? అని పవన్ ప్రశ్నించారు.