బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు షాక్ : 54 వేల మంది మెడపై కత్తి?

0
36

ప్రభుత్వ టెలికామ్ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)కి చెందిన 54,000 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం పొంచివుంది. ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనం మేరకు బీఎస్ఎన్ఎల్ బోర్డ్ 54,000 మంది ఉద్యోగులను తొలగించాలన్న ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసినట్టు సమాచారం.

కథనం ప్రకారం దీనిపై తుది నిర్ణయం ఎన్నికల తర్వాత తీసుకోవచ్చు. ఈ మేరకు మార్చిలో జరిపిన సమావేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల ప్యానెల్ ఇచ్చిన 10లో మూడు సిఫార్సులను బీఎస్ఎన్ఎల్ బోర్డు అంగీకరించింది. వీటిలో 31 శాతం సిబ్బందిని తొలగించే ప్రతిపాదన కూడా ఉంది.

ఎన్నికలు ముగిసే వరకు ఉద్యోగుల తొలగింపు ప్రణాళికపై ఎలాంటి చర్యలు చేపట్టరాదని టెలికమ్యూనికేషన్ డిపార్ట్ మెంట్ (డీఓటీ) భావిస్తోంది. ఎన్నికల సమయంలో ఉద్యోగుల తొలగింపు, వీఆర్ఎస్ ప్యాకేజీ, వ్యాపారం మూసేయడం వంటి ప్రకటనల ప్రభావం సిబ్బందిపైనే కాకుండా ఎన్నికలపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తాయని ఈ నిర్ణయం వాయిదా వేసినట్టు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ వార్తాపత్రిక తన కథనంలో పేర్కొంది.

బీఎస్ఎన్ఎల్ బోర్డు ఆమోదించిన ప్రతిపాదనలలో రిటైర్మెంట్ వయసును 60 నుంచి 58 ఏళ్లకి తగ్గించడం, 50 ఏళ్లకి పైబడిన ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్ఎస్) ప్రకటించడం, త్వరగా 4జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు జరపడం ఉన్నాయి. రిటైర్మెంట్ వయసు, వీఆర్ఎస్ నిర్ణయాలకు ప్రభుత్వ అనుమతి లభిస్తే బీఎస్ఎన్ఎల్ లో 54,451 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలు వీడక తప్పదు. ఇది బీఎస్ఎన్ఎల్ మొత్తం సిబ్బంది సంఖ్యలో 31 శాతం. కాగా, బీఎస్ఎన్ఎల్‌లో ప్రస్తుతం 1,74,312 మంది ఉద్యోగులు ఉన్నారు.