కేన్సర్ నుంచి బతికే అవకాశాలు 30 శాతమే అని వైద్యులు చెప్పినపుడు నా గుండె పగిలిపోయినంతపని అయిందని బాలీవుడ్ నటి సొనాలీ బింద్రే చెప్పుకొచ్చింది. ప్రాణాంతక కేన్సర్ వ్యాధి నుంచి ఆమె బయటపడిన విషయం తెల్సిందే. అమెరికాలో చికిత్స చేసుకుని ఇటీవలే స్వదేశానికి వచ్చింది.
ఈ నేపథ్యంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలను పరిశీలిస్తే, తనకు కేన్సర్ అని తెలిసినప్పటి విషయాలను మరోసారి గుర్తు చేసుకున్నారు. స్కాన్ ద్వారా తన ఉదర భాగంలో కేన్సర్ కణాలు పూర్తిగా వ్యాపించాయని, బతికే అవకాశం కేవలం 30 శాతమేనని వైద్యులు తేల్చినపుడు తన గుండె పగిలిందన్నారు.
చనిపోతాననే ఆలోచన అయితే తనకు రాలేదని, పూర్తిగా కోలుకునేందుకు చాలా సమయం పడుతుందని మాత్రం అర్థమైందన్నారు. ప్రస్తుతం తన శరీరంపై ఎక్కువ దృష్టి పెడుతున్నానని, చిన్న చిన్న మార్పుల్ని పట్టించుకుంటున్నానని అన్నారు. కేన్సర్‌తో పోరాడుతున్న మహిళలకు ఆమె సందేశం ఇస్తూ, అది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయమని, చుట్టూ కుటుంబ సభ్యులు, స్నేహితులు ఉండేలా చూసుకోవాలని అన్నారు. అది ప్రేమానురాగాలు పొందాల్సిన సమయమని సోనాలి తెలిపారు.