దేశంలో 17వ సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈనెల 11వ తేదీ నుంచి మే నెల 19వ తేదీ వరకు ఏడు దశల్లో ఈ ఎన్నికల ప్రక్రియ జరుగనుంది. ఈ ఎన్నికల్లో అన్ని పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇలా పోటీ చేసేవారు తమ ఆస్తిపాస్తుల వివరాలను ఎన్నికల సంఘానికి అఫిడవిట్ల రూపంలో తెలియజేయాల్సి వస్తుంది.
అయితే.. ఒక అభ్యర్థి మాత్రం చాలా ఆసక్తికరంగా ఉన్నాడు. ఆయనేమీ చాలామంది అభ్యర్థుల్లా కోటీశ్వరుడు కాదు… లక్షాధికారి అంతకన్నా కాదు.. చివరకు వేలాధికారి కూడా కాదు అంటే మీరు నమ్ముతారా? ఆయన పేరే మంగెరామ్ కశ్యప్. యూపీలోని ముజఫర్ నగర్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు.
కాకపోతే… ఆయన అత్యంత పేద అభ్యర్థి. ఆయన ఖాతాలో భూతద్దం పెట్టి వెతికినా ఒక్క పైసా కూడా కనిపించదు. ఆయన ఖాతాలో లేకపోతే ఆయనకు బినామీలు ఉండొచ్చు కదా.. అంటారా? ఆయనకు బినామీలా? ఆయన భార్య ఖాతాలో ఒక్క రూపాయి ఉండదు. ఆయన ఇప్పుడే పోటీ చేయడం లేదు. 2000 సంవత్సరం నుంచి ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. పోటీ చేస్తున్నప్పుడల్లా… మరింత పేదవాడిగా మారిపోతున్నాడు.
ఇంతకీ ఆయన వృత్తి ఏంటో అంటారా? ఆయన న్యాయవాది. వయసు 51 ఏళ్లు. సొంతంగా మజ్దూర్ కిసాన్ యూనియన్ పార్టీని స్థాపించాడు. అప్పటి నుంచి తన పార్టీ తరుపున ఒక్కడే పోటీ చేస్తాడు. ఇప్పటివరకు తన పార్టీలో వెయ్యి మంది సభ్యులు ఉన్నారట. కాకపోతే వారంతా కూలీలేనట. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే మంగేరామ్.. నామినేషన్ దాఖలు చేసిన సమయంలో తన దగ్గర రూపాయి లేదని అఫిడవిట్ సమర్పించాడు.
కాకపోతే వాళ్లు ఉండటానికి ఒక ఇల్లు. ఒక చిన్న ప్లాట్ అంతే.. అవే వాళ్ల ఆస్తి. ఆ ఇల్లు కూడా అత్తగారు కట్నం కింద ఇచ్చారట. ఎన్నికల ప్రచారం కోసం ఆయన దగ్గర ఒక బైక్ ఉంది. అంతే.. ఇంత మంది కోటీశ్వరులైన అభ్యర్థుల మధ్యలో రూపాయి కూడా లేని అభ్యర్థి.