జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖపట్టణం జిల్లాలోని యలమంచిలిలో పర్యటించిన పవన్ మాట్లాడుతూ.. వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. రెండేళ్లు జైల్లో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయిపోదామని అనుకుంటున్నాడని, అలాంటిది అందరికీ అందుబాటులో ఉండే సుందరపు విజయ్‌కుమార్ ఎమ్మెల్యే కాకూడదా? అని పవన్ ప్రశ్నించారు.
తనను ఓడించేందుకు విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయని, ఏకంగా వంద కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేను అయితే వారి తాట ఎక్కడ తీస్తానోనని భయపడుతున్నారని అన్నారు. అయితే, వారెన్ని కోట్లు ఖర్చు చేసినా తానుమాత్రం ఎమ్మెల్యేను అయి తీరుతానని, అసెంబ్లీలో అడుగుపెట్టడం పక్కా అని తేల్చి చెప్పారు.
జనసేనలో పెద్ద నాయకులు ఎవరూ లేరని గోల చేస్తున్నారని అంటున్న వారందరూ పుట్టగానే నాయకులా? అని పవన్ ప్రశ్నించారు. స్టీల్ ప్లాంటులో తుక్కు అమ్ముకున్న పంచకర్ల రమేశ్ బాబు ఎమ్మెల్యే అయ్యారని, అవంతి శ్రీనివాస్ పార్లమెంటు కేంటీన్‌లో ఉచిత భోజనం తిని భుక్తాయాసంతో నిద్రపోతుంటారని ఎద్దేవా చేశారు. వీళ్లందరూ మన నేతలని ఆవేదన వ్యక్తం చేశారు.