
అవును.. ఏపీ ప్రజలు వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డికే పట్టం కట్టనున్నారని తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల తరువాత ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుందని సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ (సీపీఎస్) సర్వే స్పష్టం చేసింది. ఎన్నికల విశ్లేషకుడు డాక్టర్ వేణుగోపాలరావు నేతృత్వంలోని టీమ్ ఈ సర్వేను ప్రకటించింది. ఏపీ ఎన్నికల్లో వైసీపీ 121 నుంచి 130 ఎమ్మెల్యే సీట్లలోను, 21 ఎంపీ సీట్లలోను విజయం సాధిస్తుందని పేర్కొంది. ఇదే సర్వేలో టీడీపీకి 45 నుంచి 54 అసెంబ్లీ సీట్లు, 4 ఎంపీ సీట్లు వస్తాయని వెల్లడి అయ్యింది. ఇకపోతే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేనకు 1 నుంచి 2 అసెంబ్లీ సీట్లు మాత్రమే వస్తాయని అంచనా వేసింది.
రెండు దశల్లో సర్వేను నిర్వహించారు. ఫిబ్రవరి 17 నుంచి 21 వరకూ తొలి దశలో 4.37 లక్షల మందిని, మార్చిలో 27 నుంచి 31 మధ్య జరిగిన రెండో సర్వేలో 3.04 లక్షల మందిని సర్వే చేసి, వారి అభిప్రాయాలను తెలుసుకున్నామని పేర్కొంది. ఓట్ల శాతం పరంగా చూస్తే, వైసీపీకి 48.1 శాతం, టీడీపీకి 40.1 శాతం, జనసేనకు 8 శాతం ఓట్లు వస్తాయని, కాంగ్రెస్, బీజేపీలు పెద్దగా ప్రభావం చూపబోవని సీపీఎస్ అంచనా వేసింది. జనసేన పార్టీ ప్రభావం ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖ జిల్లాపై మాత్రమే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. కాగా, ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీపీఎస్ ఇచ్చిన సర్వే దాదాపు నిజమైంది.
ఇదిలా ఉంటే.. వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మద్దతు తెలిపారు. మోదీనే కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ఎవరు ముందుకు వస్తారో వారితో ఎన్నికల తర్వాత కలుస్తామని స్పష్టం చేశారు.
మోదీ, రాహుల్‌లలో ఎవరు బలమైన ప్రధాని అభ్యర్థి అవుతారని ప్రశ్నించగా జగన్ మోదీకే ఓటు వేశారు. రాహుల్ గాంధీ రెండు చోట్ల పోటీ చేయడంపై ప్రశ్నించగా ఆ అంశంపై తాను ఎలాంటి కామెంట్ చేయలేనన్నారు. అమేథీలో రాహుల్ పరిస్థితి అంత భద్రంగా లేదేమో అందుకే కేరళలోనూ పోటీ చేస్తుండవచ్చని జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
అయితే ఐదేళ్లు మోదీ అధికారంలో ఉండి, అవకాశం ఉన్నప్పటికీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని జగన్ మండిపడ్డారు. ఎన్నికల తర్వాత ఏపీకి ఎవరు ప్రత్యేక హోదా ఇస్తే వారితోనే ఉంటామని జగన్ స్పష్టం చేశారు.
ఎన్నికల ముందు కేసీఆర్‌తో తమకు ఎలాంటి పొత్తులు లేవని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్, ఎంఐఎం వైఎస్ఆర్సీపీ మధ్య ఉంది కామన్ ఇంట్రెస్ట్ మాత్రమే అని ఆయన చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం మద్దతునిస్తామన్న కేసీఆర్‌కు జగన్ ధన్యవాదాలు తెలిపారు. ఏపీకి చెందిన 25 మంది ఎంపీలు, తెలంగాణకు చెందిన 17 మంది ఎంపీలు కలిస్తే ప్రత్యేక హోదా సాధించడం సులభతరం అవుతుందన్నారు. ఎన్నికల తర్వాత ప్రత్యేక హోదాపై సంతకం చేశాకే కేంద్రంలో ఏ కూటమికైనా మద్దతు ఇస్తామన్నారు.
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్న జగన్.. వైఎస్ఆర్సీపీ అధికారంలో వస్తే.. బాబు అవినీతి, అధికార దుర్వినియోగంపై విచారణ చేపడతామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తెలంగాణకు చెందిన 17 మంది ఎంపీలు మద్దతుగా ఉంటారని కేసీఆర్ మాటిచ్చారని జగన్ స్పస్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 25 మంది, తెలంగాణ నుంచి 17 మంది మెుత్తం 42 మంది ఎంపీలు కలిసి పార్లమెంట్ లో ప్రత్యేక హోదాపై నిలదీస్తే కచ్చితంగా కేంద్రం దిగిరావాల్సిందేనని చెప్పుకొచ్చారు.