కలియుగం ఉగాది రోజునే ప్రారంభమైందని పురాణాలు చెప్తున్నాయి. చైత్రమాసం, శుక్లపక్ష పాడ్యమి రోజున ఈ పండుగను జరుపుకుంటారు. బ్రహ్మ గత ప్రళయం పూర్తయ్యిన తర్వాత తిరిగి సృష్టి ప్రారంభించు సమయాన్ని బ్రహ్మకల్పం అంటారు. ఇలా ప్రతికల్పంలోను మొదటవచ్చేది యుగాదిని యుగానికి ఆదిగా, ప్రారంభ సమయంగా “ఉగాది” అని వ్యవహరిస్తూ ఉంటారు.
అందుచేత ఈ ఉగాది పర్వ శుభదినాన అందరూ ప్రాతఃకాలమున నిద్రలేచి అభ్యంగనస్నానమాచరించి నూతన వస్త్రములు ధరించి మంగళ ప్రదమైన మావిడాకులు రంగవల్లికలు ముంగిట అలంకరించుకుని వసంతలక్ష్మిని స్వాగతించాలి. షడ్రుచులతో సమ్మిళతమైన ఉగాది ప్రసాదాన్ని కూడా సూర్యోదయానికి ముందే స్వీకరించాలి. అంటే ప్రాతఃకాల స్నానం, పూజ, పచ్చడి ప్రసాద స్వీకరణ అంతా.. సూర్యోదయానికి ముందే జరిగిపోవాలని పండితులు సూచిస్తున్నారు.
ఈ ఉగాది పచ్చడిని వైద్యపరంగా పరిశీలిస్తే ఇది వ్యాధినిరోధక శక్తిని ఇస్తుందని కూడా చెప్తారు. ఆ పచ్చడిలోని షడ్రరుచులలోని తీపి-చేదులో మానవ మనుగడలకు ప్రతీకలై నిలుస్తూ ఉంటాయని అంటుంటారు.
ఇక తెలుగువారి సంప్రదాయాల్లో మరో ముఖ్యమైన విషయం పంచాంగ శ్రవణం. ఉగాది నాడు అందరూ కలిసి నిష్ణాతులైన జ్యోతిష్య పండిత శ్రేష్టులను ఆహ్వానించి వారిని సన్మానించి ఒక పవిత్ర ప్రదేశమందు పంచాంగ శ్రవణము చేస్తారు. ఆ రోజు అందరూ ఆ నూతన సంవత్సరంలోని శుభశుభాలను తెలుసుకుని దానికి అనుగుణంగా వారి భావిజీవితాన్ని తీర్చిదిద్దుకునేందుకు అంకురార్పణలు చేస్తారు.
ఈ పంచాంగ శ్రవణంలోని పంచ అంగాల వల్ల, తిథితో సంపదను, వారంతో ఆయుష్షు, నక్షత్రంతో పాపప్రక్షాళ, యోగం వలన వ్యాధి నివృత్తి కావడం, కరణంవల్ల గంగాస్నానం చేసినంత పుణ్యఫలాన్ని అందిస్తుందని పలువురి విశ్వాసం. మరి తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు.