గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి మంత్రి నారా లోకేష్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మంగళగిరి మండలం చినకాకినిలో ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారానికి హాజరయ్యేందుకు టీడీపీ నేత పోలవరపు హరిబాబు కారులో వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడితో కారు వెనుక భాగంలోని అద్దాలు పగిలిపోయాయి. ఈ దాడిపై హరిబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నారా లోకేష్ కారుపై జరిగిన రాళ్లదాడిపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అలాగే వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీపై టాలీవుడ్ యువ హీరో నారా రోహిత్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
టీడీపీ తరఫున గుంటూరు జిల్లా నకిరేకల్లు మండలం గుండ్లపల్లిలో ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా నారా రోహిత్ మాట్లాడుతూ.. జగన్, మోదీ, కేసీఆర్ ముగ్గురూ గుంటనక్కలని విమర్శించారు. ఎవరెన్ని కుయుక్తులకు పాల్పడినా ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రాన్ని దెబ్బతీయడానికి మోదీ, కేసీఆర్, జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం ఉండదని అన్నారు. రాష్ట్రం మరోసారి ప్రగతిపథంలో నడవాలంటే ఈ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయాల్సిన అవసరం ఉందని నారా రోహిత్ స్పష్టం చేశారు.