టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బీజేపీ నేత సోము వీర్రాజు గట్టి వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో కేవలం అవినీతి, అక్రమాలే చోటుచేసుకున్నాయని విమర్శించారు. దొంగలెక్కలు చూపిన ఏపీ ప్రభుత్వం అవార్డులు దక్కించుకుందని దుయ్యబట్టారు.
గత కొన్ని రోజులుగా ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకుని చంద్రబాబు నిప్పులు చెరుగుతున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా, మోడీ తల్లిపై చంద్రబాబు వ్యాఖ్యలను సోము వీర్రాజు తీవ్రంగా తప్పుపట్టారు. చంద్రబాబు పదేపదే ఇలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తున్నారనీ, మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే నాలుక చీలుస్తామని హెచ్చరించారు.
కేంద్రం తెచ్చిన సంక్షేమ పథకాలకు పేర్లు మార్చి తానే ప్రవేశపెట్టినట్లు చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం కోసం కేంద్రం రూ.7 వేల కోట్లు విడుదల చేస్తే.. చంద్రబాబు ఆ నిధులను ఇతర కార్యక్రమాలకు మళ్లించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అవినీతిపై దమ్ముంటే చంద్రబాబు బహిరంగ చర్చకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.