మీ ఇద్దరికీ పోయే రోజులు దగ్గరపడ్డాయి.. మీ అంతు తేలుస్తాం : చంద్రబాబు

0
53

ప్రధాని నరేంద్ర మోడీ, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలదాడి చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు సభలో ఆయన మాట్లాడుతూ, రెండు రోజుల క్రితం మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్‌ ఇంట్లో ఐటీ దాడులు చేయించారని, గురువారం గుంటూరులో నాని అనే మరో నేత ఇంటిలో సోదాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మిస్టర్ నరేంద్ర మోడీ… నీకు పోయే రోజులు వచ్చి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు’ అంటూ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నువ్వు మాపై అరాచకాలకు పాల్పడుతుంటే ఆ గోడు తగిలి నీ ఉద్యోగం ఊడుతుంది మోడీ’ అంటూ హెచ్చరించారు.

“నీ ఉద్యోగం శాశ్వతం అని అనుకోవద్దు, మళ్లీ రోడ్డుపై తిరిగే రోజొస్తుంది, నిన్ను ఛీకొట్టి ప్రజలు అసహ్యించుకునే రోజొస్తుంది, మా కడుపు కొట్టొద్దు, మమ్మల్ని బాధ పెట్టొద్దు, వైసీపీలో అవినీతి నేతలు లేరా? ఎందుకు మాపై పడుతున్నావు?” అంటూ చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఈ ఎన్నికల్లో టీడీపీ నేతలను భయభ్రాంతులకు గురిచేసి ఇళ్లలో కూర్చునేలా చేయాలని పన్నాగాలు పన్నుతున్నారని ఆరోపించారు. “టంగుటూరి ప్రకాశం పంతులు జన్మించిన గడ్డ ఇది, బ్రిటీష్ వాళ్లకు రొమ్ము చూపించి, ధైర్యం ఉంటే కాల్చుకోమని ఎదిరించిన వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు, ఆయన స్ఫూర్తితో పోరాడుతాం, నువ్వు ఒక్క దాడి చేయిస్తే మేం 10 సీట్లు ఎక్కువగా గెలుస్తాం, నీ అంతు తేలుస్తాం!” అంటూ హెచ్చరించారు.

“ఒకాయన చంపడమో, చంపించుకోవడమో అని వ్యాఖ్యానిస్తున్నాడు. నువ్వు చంపేదీ లేదు, చంపించుకునేదీ లేదు, శాశ్వతంగా జైల్లో పెట్టిస్తాం ఏమనుకుంటున్నారో!” అంటూ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో రౌడీ అన్నవాడు లేకుండా చేస్తానని, రౌడీయిజం చేయాలని ఎవరైనా ముందుకు వస్తే అణచివేస్తానని, తాను రౌడీలకు రౌడీగా ఉంటానని ఉద్ఘాటించారు.

“నా దగ్గర రౌడీయిజం చేయడం వైఎస్ కే చేతకాలేదు. 24 బాంబులేసి చంపాలని ప్రయత్నంచారు, ఏమీ చేయలేకపోయారు. రౌడీల తోక కట్ చేస్తా! ఇతరుల పెత్తనం ఇక్కడ జరగడానికి లేదు” అని స్పష్టం చేశారు. వైసీపీ గెలిస్తే వీధికో కీచకుడు తయారవుతాడని చంద్రబాబు అన్నారు.