సీఎస్ బదిలీ… ఊడిగం చేయాలా.. చంద్రబాబు ధ్వజం.. అంతా మోదీ మాయే..?

0
39

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎస్ అనిల్ చంద్ర పునేఠాను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై బాబు తీవ్రంగా స్పందించారు. విశాఖపట్నం రోడ్ షోలో ఉండగానే, ఏపీ సీఎస్ బదిలీ సమాచారం అందుకున్నారు.

రాష్ట్ర అధికారులను ఎన్నికల సంఘం ఉద్దేశపూర్వకంగానే తొలగిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. ఇదంతా ప్రధాని మోదీ ఆదేశాల మేరకే జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరస్తులకు సహకరిస్తూ తమపై దాడులు చేయిస్తున్నారని, మోదీ, అమిత్ షా తనను బెదిరిస్తున్నారని బాబు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కనపెట్టి మీకు నేను ఊడిగం చేయాలనా మీ ఉద్దేశం? అంటూ నిప్పులు చెరిగారు.

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక కలెక్టర్‌ను ఆపై ఇద్దరు ఎస్పీలను బదిలీ చేశారు. ఆపై ఇంటలిజెన్స్ డీజీని మార్చేశారు. ఇప్పుడు సీఎస్ వంతు వచ్చింది. దీనిపై నిలదీయాల్సింది ఎవరిని?” అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు.

ఏపీ సీఎస్ అనిల్ చంద్ర పునేఠాపై ఈసీ బదిలీ వేటు వేసిన నేపథ్యంలో బీజేపీ ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగింది. దీనిపై బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు స్పందిస్తూ.. సీఎస్ పునేఠా బలికావడానికి చంద్రబాబునాయుడే కారణమని ఆరోపించారు. చంద్రబాబు ఆదేశాలు పాటిస్తూ, ఎన్నికల సంఘం ఆదేశాలు బుట్ట దాఖలు కావడానికి సీఎస్ పరోక్షంగా కారణమయ్యాడని విమర్శించారు.

దీనిపై టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రిని తిరగకుండా చేయడం కోసం, ముఖ్యమంత్రిని శక్తిహీనుడ్ని చేయడం కోసం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కేంద్రం తమకు అనుకూలంగా ఉన్న కీలుబొమ్మ వ్యవస్థ ద్వారా తీసుకున్న నిర్ణయాలు అని విమర్శించారు. ఎన్నికల సంఘానికి వెన్నెముక లేదని అన్నారు.