నిజామాబాద్‌లో కవిత గట్టెక్కేనా.. పగటిపూటే చుక్కలు చూపుతున్న రైతులు

0
79

నిజామాబాద్‌ ‌లోక్‌సభ స్థానంలో ఎన్నిక ఈ దఫా ఎన్నడూ లేనివిధంగా ఉత్కంఠ నెలకొంది. సిట్టింగ్ ఎంపీ కె.కవిత తెరాస అభ్యర్థిగా పోటీ చేస్తోంది. ఆమెను ఓడించాలన్న పట్టుదలతో పసుపు, ఎర్రజొన్న రైతులు వందమందికిపైగా పోటీ చేస్తున్నారు. ఫలితంగా ఈ స్థానంలో ఏకంగా 185 మంది వరకు పోటీలో ఉన్నారు. ఈ నియోజకవర్గం తీరూతెన్నులను పరిశీలిస్తే,

పార్లమెంట్ నియోజకవర్గంపై జాతీయస్థాయిలో ఆసక్తి నెలకొంది. రెండు జాతీయ పార్టీలు వర్సెస్ ఓ ప్రాంతీయ పార్టీ మధ్య నడిచే సమరంలో, విజయం ఎవరిని వరిస్తుందన్నది ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో గత ఎన్నికల్లో గెలిచి, దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న గులాబీ నాయకురాలు అక్కడి నుంచి సిట్టింగ్ ఎంపీగా మళ్లీ బరిలో దిగుతుండగా కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ బరిలో నిలిచారు. కమలం పార్టీ నుంచి క్యాడర్‌ పెంచుకున్న నాయకుడు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తానికి దేశ స్ధాయిలో హీట్ పుట్టిస్తున్న నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్‌ చరిత్ర ఏంటో చూద్దాం.

నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్‌లో నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, ఆర్మూర్, బోధన్, జగిత్యాల్, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం ఓటర్లు 14,88,270 మంది ఓటర్లున్నారు. ఇందులో మహిళలు 7,49,000 కాగా, పురుషులు 7,01,000గా ఉంది. ఇక 2014 ఎన్నికలను పరిశీలిస్తే నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో త్రిముఖపోరు కొనసాగింది. తెరాస నుంచి సీఎం కేసీఆర్‌ కూతురు, సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్‌ నుంచి మధుయాష్కీ గౌడ్‌, బీజేపీ నుంచి యెండల లక్ష్మీనారాయణ బరిలో దిగారు.

గత ఎన్నికల్లో మొత్తం 10,33,924 ఓట్లు పోలవగా టీఆర్ఎస్‌ అభ్యర్థి కవితకు 4,39,307 ఓట్లు వచ్చాయి. అంటే దక్కిన పర్సంటేజ్‌ 42.49 శాతం. ఇక కాంగ్రెస్‌ అభ్యర్థి మధుయాష్కీకి 2,72,123 ఓట్లు, బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణకు 2,25,333 ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో కవితకు వచ్చిన మెజారిటీ లక్షా 67 వేల 184ఓట్లు. ఈసారి ఎన్నికల్లో ఆ పార్లమెంట్ స్థానాన్ని చేజిక్కించుకోవాలని హస్తం పార్టీ ఉవ్విళ్లూరుతుంటే.. ఒక్క అవకాశమంటూ కమలదళం నేతలు స్ట్రాటజీలు సిద్దం చేస్తున్నారు.

తెరాస నుంచి సిట్టింగ్ ఎంపీ కవిత, కాంగ్రెస్‌ నుంచి మాజీ ఎంపీ మధుయాష్కీ, బీజేపీ నుంచి ధర్మపురి అర్వింద్‌ బరిలో ఉండటంతో ఎలాగైనా ఈసారి ఆ కోటపై తమ జెండాలను ఎగురవేసేందుకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. వీరికితోడు పసుపు, ఎర్రజొన్న రైతులంతా కలిసి కె.కవితను ఓడించాలన్న పట్టుదలతో ఉన్నారు. అందుకే భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. ఫలితంగా ఇక్కడ రాజకీయ ఉత్కంఠత నెలకొంది.