జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచన తప్పులేదని, ఆ ఆలోచన ఎవరికైనా ఉండొచ్చని, తనకు కూడా ఉందంటూ సినీ హీరో, వైసీపీ నేత రాజశేఖర్ అన్నారు. సినిమా రంగంలో ఓ కాలు, రాజకీయ రంగంలో మరో కాలు పెట్టిన పవన్, పూర్తిగా సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి రావాలని సూచించారు.
అంతే తప్ప, నాలుగేళ్లు సినిమాలు చేసుకుని, ఐదో ఏడాదిలో వచ్చి ‘నేను దేశం కోసమే బతుకుతున్నా, దేశం కోసమే అన్నీ చేస్తానని చెప్పి, మనల్ని ఏమార్చి ముఖ్యమంత్రి అయిపోతారట’ అంటూ దెప్పిపొడిచారు. ప్రజల జీవితాలతో ఎందుకు ఈ ఆటలు? అని ప్రశ్నించారు.
జనసేన పార్టీకి ఎవరూ ఓటు వేయొద్దని, వైసీపీకి ఓటు వేసి ప్రజలు తమ భవిష్యత్‌ను బంగారం చేసుకోవాలని రాజశేఖర్ అన్నారు. సినిమాల్లో నటిస్తే తనకు వచ్చే కోట్లకు కోట్ల డబ్బు వదిలేసి ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చానని, త్యాగం చేసి వచ్చానని పవన్ చెబుతున్నారని, ఇదంతా అబద్ధమని, ‘బాహుబలి’ కన్నా పెద్ద ప్యాకేజ్‌ను ఆయన తీసుకుని వచ్చారని ఆరోపించారు.
రాష్ట్రంలో ప్రతిదీ చంద్రబాబు అమ్ముకున్నారని ఆరోపించారు. అమరావతిని సింగపూర్‌లా చేయడం కోసం అప్పులు ఎందుకు చేయడం? సింగపూర్ కంపెనీకి చంద్రబాబు ఏజెంట్‌గా ఉంటూ, రైతుల దగ్గర తీసుకున్న భూములను కమీషన్ పద్ధతిలో ఆ కంపెనీకి అమ్మేశారని ధ్వజమెత్తారు. ఇదా ముఖ్యమంత్రి చేసే పని? అని ప్రశ్నించారు. ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడ్డారని, ఈ పరిపాలనను చాలా కంపు చేశారని ఆరోపించారు.
ఎన్నికలకు ముందు ఓ బిస్కెట్ వేసినట్టుగా ‘పసుపు-కుంకుమ’ పథకాన్ని తీసుకొచ్చారని విమర్శించారు. ఈ డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? చంద్రబాబు ఇంటి నుంచి తెచ్చారా? లేక ఆయన అత్తగారింటి నుంచి తెచ్చారా? అని ప్రశ్నించారు. లేకపోతే సింగపూర్, మలేషియాలో ఉన్న ప్రాపర్టీస్‌ను అమ్మేసి తీసుకొచ్చారా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మంచి చేయాలనుకుంటే డ్వాక్రా మహిళల రుణాలను ఎప్పుడో మాఫీ చేయాల్సింది అని అన్నారు.