జగన్‌ను సీఎం చేసేందుకు నన్ను కూడా అరెస్టు చేయొచ్చు : చంద్రబాబు

0
46

వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు తనను కూడా అరెస్టు చేయవచ్చన్న సందేహాన్ని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అనుమానం వ్యక్తం చేశారు.

తన ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖపట్నం కంచరపాలెంలో రోడ్ షో నిర్వహించారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలోనే రాష్ట్ర సీఎస్ పునేఠా బదిలీకి సంబంధించిన సమాచారం తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ క్రమంలో తనను కూడా అరెస్ట్ చేస్తారేమో అంటూ సందేహం వెలిబుచ్చారు.

అయితే, తాను దేనికీ భయపడబోనని, అరెస్ట్ చేస్తే చేసుకోనివ్వండి అంటూ వ్యాఖ్యానించారు. నేరస్తులను తాను ఏనాడూ ప్రోత్సహించలేదని, మతకలహాలను, తీవ్రవాదాన్ని ఉక్కుపాదంతో తొక్కిపెట్టానని అన్నారు. తనపై బాంబులు వేసినా భయపడలేదని, ఇప్పుడు ఏకాకిని చేసి దాడులు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ అభ్యర్థులపై ఐటీ, ఈడీలతో దాడులు చేయిస్తున్నారని, అవసరమైతే తాను కూడా జైలుకెళ్తానని, దేనికీ వెనుకంజ వేసేది లేదని స్పష్టంచేశారు. సీబీఐ, ఈడీ, ఆర్బీఐ వంటి వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాడంటూ ప్రధాని మోడీపై మండిపడ్డారు. మోడీ వంటి దుర్మార్గుడు మరొకరు లేరని విమర్శించారు.

ప్రధాని మోడీని చూస్తే వైసీపీ అధినేత జగన్‌కు భయమని, అందుకే ఏపీ ప్రజలను తాకట్టు పెట్టేందుకు సిద్ధమవుతున్నారన్నారు. ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే ఏపీ ప్రాజెక్టులన్నీ కేసీఆర్ హస్తగతమవుతాయన్నారు.

ప్రభుత్వ సంపదను ప్రజలకు పంచుతుంటే వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇకపై ప్రతి ఏడాది మహిళలకు ‘పసుపు-కుంకుమ’ ఇస్తానని ప్రకటించారు. మచ్చుమర్రి, పోతిరెడ్డిపాడులను మూసివేయాలని కేసీఆర్ కోరుతున్నారని, అవి మూసేస్తే రాయలసీమ ఎడారి అవుతుందన్నారు. జగన్ అధికారంలోకి వస్తే కాల్వల్లో పారేది నీరు కాదని, కన్నీరని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీని ప్రత్యేక హోదా అడిగితే ఎదురు దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.