ఐపీఎల్.. అబ్బా.. హ్యాట్రిక్ విజయం కాదు.. కోహ్లీకి హ్యాట్రిక్ పరాజయం

0
53

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్‌లో భాగంగా ఆదివారం మ్యాచ్‌లో కూడా ఢిల్లీ కాపిటల్స్ చేతిలో ముచ్చటగా డబుల్ హ్యాట్రిక్ అపజయాన్ని మూటగట్టుకుంది బెంగుళూరు రాయల్ చాలెంజర్స్‌. బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 149 పరుగులు మాత్రమే చేసింది.

కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేసినప్పటికీ, మరో ఎండ్ నుంచి బ్యాట్స్‌మెన్ వరుసగా పెవిలియన్ బాట పట్టడంతో స్కోరుబోర్డు భారీ టార్గెట్ దిశగా కదలకుండా మొరాయించింది. దీంతో కోహ్లీ కూడా 41 పరుగులు చేసి వెనుదిరిగాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్లు కూడా రాణించలేకపోవడంతో బెంగుళూరు తొలి ఇన్నింగ్స్‌లో ఎనిమిది వికెట్లు కోల్పోయి కేవలం 149 పరుగులు చేసింది. చివర్లో మొయిన్ ఆలీ ఒక్కడే 32 పరుగులు చేసి కెప్టెన్ కోహ్లీకి అండగా నిలిచాడు.

ఢిల్లీ బౌలర్ల విషయానికి వస్తే రబడా తన స్పెల్‌లో కేవలం 21 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అలాగే క్రిస్ మోరిస్ సైతం 2 వికెట్లు పడగొట్టాడు. అలాగే అక్సర్ పటేల్, సందీప్ చెరో వికెట్ పడగొట్టి ఢిల్లీ బౌలింగ్ లైనప్ సత్తా చాటారు.

150 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీకి ఓపెనర్ శిఖర్ ధావన్ డకౌట్‌గా వెనుతిరిగినప్పటికీ, తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయస్ అయ్యర్ మాత్రం నిలకడగా ఆడుతూ 50 బంతుల్లో 67 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

అలాగే మరో ఓపెనర్ పృథ్వీ షా 28, కొలిన్ ఇన్‌గ్రామ్ 22, రిషబ్ పంత్ 18 పరుగులు చేయడంతో ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఢిల్లీ కాపిటల్స్ లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని అందుకుంది. నాలుగు వికెట్లు పడగొట్టిన కగిసో రబదాను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.