నా భర్తను గెలిపించండి.. మా మామను సీఎంను చేయండి : బ్రహ్మణి పిలుపు

0
45

మంగళగిరిలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన భర్త నారా లోకేశ్‌ గెలిపించడమే కాకుండా తమ మామ చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేయాలని ఓటర్లకు నారా బ్రహ్మణి పిలుపునిచ్చారు. తన భర్త నారా లోకేష్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో బ్రాహ్మణి ఎన్నికల ప్రచారం చేశారు.

ఈ సందర్భంగా గత ఐదేళ్ళ కాలంలో చంద్రబాబు సర్కారు అమలు చేసిన సంక్షేమ పథకాలను ఏకరవు పెట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.24వేల కోట్ల రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం టీడీపీ అని గుర్తుచేశారు. బ్రాహ్మణి చంద్రబాబు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు రూ.15వేలు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలంటే లోకేష్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మరోసారి చంద్రబాబు ఏపీకి సీఎం కావాల్సిన అవసరం ఉందన్నారు.

టీడీపీ అభ్యర్థి నారా లోకేష్‌ను గెలిపిస్తే మంగళగిరిని ఎవరూ చూడనంత స్థాయిలో అభివృద్ధి చేస్తారన్నారు. లోకేష్ తరుఫున బ్రాహ్మణి తొలిసారి ఎన్నికల ప్రచారం చేశారు. లోకేష్‌ను గెలిపిస్తే ప్రతి ఇంటికి తాగునీటి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. తన భర్త ఎమ్మెల్యే కాకపోయినా ఐటీ మంత్రి హోదాలో మంగళగిరికి 42 కంపెనీలు తీసుకొచ్చారని, 3 వేల 500 మందికి ఉద్యోగాలు ఇచ్చారని బ్రాహ్మణి తెలిపారు. అభివృద్ధి పనులు కొనసాగాలంటే ఎమ్మెల్యే అభ్యర్థి లోకేష్, ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని బ్రాహ్మణి కోరారు.

ముఖ్యంగా, రాజధాని ప్రాంతంలో ఉన్న మంగళగిరికి ఐదేళ్లలో మరిన్ని సంస్థలు తీసుకొచ్చి 15వేల ఉద్యోగాలు ఇచ్చేందుకు లోకేష్ కృషిచేస్తారని బ్రాహ్మణి చెప్పారు. ఇప్పటికే మంగళగిరిలో రూ.40 వేల కోట్ల విలువైన పనులు జరిపిస్తున్నారని ఆమె వెల్లడించారు. లోకేష్ ఎమ్మెల్యే అయితే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని, మంగళగిరిని మరో స్థాయికి తీసుకెళతారని హామీ ఇచ్చారు.

తొలిసారి పార్టీ మేనిఫెస్టో కాకుండా లోకేష్ సొంతంగా మంగళగిరి మేనిఫెస్టో రూపొందించారని ఆమె తెలిపారు. మంగళగిరిలో ఉన్న అన్ని సమస్యలను ఆ మేనిఫెస్టోలో పొందుపరిచారని చెప్పారు. తమ ఇల్లు, ఓట్లూ మంగళగిరిలోనే ఉన్నాయని వెల్లడించారు. కుప్పం నుంచి తమ వాళ్లు వస్తే ఎలా ఆహ్వానిస్తామో, మంగళగిరి ప్రజలు వచ్చినా అలాగే ఆహ్వానిస్తామన్నారు. లోకేష్ ఇక్కడే కార్యాలయం ఏర్పాటు చేసుకుని నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరిస్తారని, ఆ తర్వాతే ఇతర వ్యవహారాలు చూసుకుంటారని బ్రాహ్మణి చెప్పారు.