సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జూనియర్ ఎన్టీఆర్‌పై ఇటీవల ట్విట్టర్‌లో కూసిన సంగతి తెలిసిందే. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలో చంద్రబాబు నిజ స్వరూపాన్ని చూపించానని చెప్పుకుంటున్న వర్మ, ఏపీలో తన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదలను అడ్డుకోవడంతో టీడీపీపై మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.
ఇటీవలే టీడీపీకి షాక్ ఇచ్చే ఓ ట్వీట్ చేశాడు వర్మ. నారా లోకేష్ టీడీపీకి నిజమైన వారసుడు కాదని చెప్పిన వర్మ జూనియర్ ఎన్టీఆరే అసలైన వారసుడని పేర్కొన్నాడు. టీడీపీ పార్టీ భవిష్యత్తు కూడా జూనియర్ ఎన్టీఆరే అని చెప్పాడు. ఇది చూసిన నెటిజన్లు సరిగ్గా చెప్పారని, ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నామని రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
ఇలాంటి తరుణంలో బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ తెరంగేట్రంపై స్పందించారు. ఇంకా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై స్పందించారు.
విశాఖపట్నం బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న పురందేశ్వరి తన మేనల్లుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ, అతనికి సినిమాల్లో మంచి భవిష్యత్ ఉందని, ఇప్పట్లో రాజకీయాల్లోకి రాకపోవచ్చని అన్నారు. కానీ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలనుకుంటే అతనికి సలహాలు ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పురందేశ్వరి స్పష్టం చేశారు.
తనకు సలహాదారుగా ఉండమని ఎన్టీఆర్ స్వయంగా అడగాలని, అంతే తప్ప ఉచిత సలహాలు ఇచ్చే ప్రయత్నం మాత్రం చేయనని కామెంట్ చేశారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనే లేదని గతంలో చాలాసార్లు చెప్పాడని, అందుకే తారక్ రాజకీయ జీవితం గురించి ఇప్పుడే చర్చించాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్టు వెల్లడించారు.