అవునా..? వైకాపా నేత షర్మిలకు, బాహుబలి హీరో ప్రభాస్‌కు లింకు పెట్టింది ఎవరో కాదు.. నందమూరి హీరో బాలకృష్ణ అని తెలియవచ్చింది. ఈ విషయాన్ని షర్మిల స్వయంగా చెప్పుకొచ్చారు. ప్రముఖ హీరో ప్రభాస్, వైసీపీ మహిళా నాయకురాలు వైఎస్ షర్మిళకు మధ్య సంబంధాలు అంటగడుతూ సామాజిక మాధ్యమాల వేదికగా దుష్ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
దీనిపై షర్మిల పోలీసులకు ఫిర్యాదు చేయడం కూడా తెలిసిందే. ఈ వదంతులు సరిగ్గా ఎన్నికల సమయంలో పుట్టుకొస్తున్నాయని షర్మిల చెప్పుకొచ్చారు.
గతంలో 2014కు ముందు తనపై ఈ దుష్ప్రచారం ప్రారంభించారని, ఇవేవో పుకార్లు అనుకుని పెద్దగా పట్టించుకోలేదని తెలిపారు. మళ్లీ ఈ ఎన్నికలు వచ్చేసరికి అదే తరహాలో పుకార్లు మొదలయ్యాయని ఓ ఇంటర్వ్యూలో షర్మిల చెప్పుకొచ్చారు.
మళ్లీ, ఈ ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి అదే మాదిరి పుకార్లు మొదలు పెట్టారని, ఎన్నికలు దృష్టిలో పెట్టుకునే ఈ పని చేస్తున్నారన్న విషయం తనకు అర్థమైందని అన్నారు.
ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ పని చేసేది టీడీపీయేనని, ఎన్నికలు సమయం సమీపిస్తున్న కొలదీ ఈ దుష్ప్రచారం మరింత ఎక్కువగా చేస్తారన్న కూడా తెలిసిందని అర్థమైందని చెప్పుకొచ్చారు. వ్యక్తిగతంగా దీని గురించి మాట్లాడటం ఇబ్బంది కలిగినా.. పోలీసులకు ఫిర్యాదు చేశానని.. కానీ పోలీసులు చెప్పిన విషయం తనకు షాక్‌నిచ్చిందని షర్మిల వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో ఎన్బీకే అనే ఓ బిల్డింగ్ ఉందని, ఆ బిల్డింగ్ నందమూరి బాలకృష్ణది అని, అక్కడి నుంచి తనపై దుష్ప్రచారం జరిగిందని, ఐపీ అడ్రసులను అనుసరించి పోలీసులు చెబుతున్నారని అన్నారు.
ఈ బిల్డింగ్ నుంచి తనపై దుష్ప్రచారం ఒక ఎత్తయితే, టీడీపీకి అనుకూలంగా ఉండే కొన్ని వెబ్ సైట్స్ చేసిన దుష్ప్రచారం మరో ఎత్తని ఆవేదన వ్యక్తం చేశారు. బాలకృష్ణ బిల్డింగ్ నుంచి ఇంత జరుగుతుంటే ఆయనకు తెలియదని నేను ఎట్టా అనుకుంటా? అని ప్రశ్నించారు.
స్వయంగా బాలకృష్ణే తనపై ఈ నీచమైన పుకార్లు పుట్టించారని, వాటిని ప్రచారం చేశారని తాను నమ్ముతున్నానని అన్నారు. బాలకృష్ణ ఇంత దిగజారుడు తనానికి ఎందుకు పాల్పడ్డారో ఆయనే బదులివ్వాలని షర్మిల డిమాండ్ చేశారు.