జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‍పై వైకాపా మహిళా నేత వైఎస్. షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తన అన్న చిరంజీవిని పవన్ కల్యాణ్ ఆదర్శంగా తీసుకున్నారని విమర్శించారు. చిరంజీవి పీఆర్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినట్టే.. పవన్ కూడా జనసేన పార్టీని టీడీపీకి హోల్ సేల్‌గా ఏదో ఒక రోజు అమ్మేస్తారని జోస్యం చెప్పారు.
తన ఎన్నికల ప్రచారంలో భాగంగా, కాకినాడలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె పవన్, చంద్రబాలపై విమర్శలు గుప్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబు డైరెక్షన్‌లో పవన్ నడుస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో అవినీతి పాలన పోయి రాజన్న రాజ్యం రావాలంటే జగన్ సీఎం కావాలని పిలుపునిచ్చారు.
చంద్రబాబు పౌరుషం, రోషం అంటూ ఆయనకు సూట్ కానీ పెద్ద మాటలు మాట్లాడుతున్నారని షర్మిల మండిపడ్డారు. కేసీఆర్‌తో జగన్‌కు పొత్తుందని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీకి ఏ పార్టీతోనూ పొత్తు లేదన్నారు. హరికృష్ణ మృతదేహాన్ని పక్కనే ఉంచుకుని కేసీఆర్‌తో పొత్తు కోసం వెంపర్లాడింది చంద్రబాబు కాదా.. అప్పుడు చంద్రబాబు పౌరుషం చచ్చిపోయిందా అని ప్రశ్నించారు.
ఒక్క ఎన్నిక కూడా గెలవకుండా కొడుకుని ఎమ్మెల్సీని చేశారు… మంత్రి పదవి ఇచ్చారు.. అప్పుడు చంద్రబాబు పౌరుషం నిద్రపోయిందా అని అడిగారు. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని, అధికారాన్ని కబ్జా చేయడాన్ని పౌరుషం అంటారా.. అని షర్మిల మండిపడ్డారు.
టీడీపీ వాళ్లు ఓట్లు అడిగేందుకు వచ్చి, డబ్బు ఇచ్చే ప్రయత్నాలు చేస్తారని ఆరోపించారు. ఆ డబ్బు ఇచ్చేందుకు వచ్చినవారిని… బాబు ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడగాలని షర్మిల సూచించారు. వైసీపీ కాకినాడ ఎంపీ అభ్యర్థి వంగ గీత, కాకినాడ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రశేఖరరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని షర్మిల అభ్యర్థించారు.