ఏపీ రాజకీయాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ వేలు పెట్టడం మంచిది కాదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సూచించారు. అనకాపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పవన్ మాట్లాడుతూ.. కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయమై కేసీఆర్ అండగా ఉంటారని వైఎస్ జగన్ చెబుతున్నారని, ఇదే విషయమై కేసీఆర్‌తో ఓ ప్రకటన ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఏపీ రాజకీయాలను ఇక్కడి ప్రజలకే వదిలేయండి.
ఏపీ రాజకీయాల్లోకి టీఆర్ఎస్ నిజంగా రావాలనుకుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి పేరుతో అభ్యర్థులను నిలబెడితే సంతోషిస్తామని పవన్ కల్యాణ్ వెల్లడించారు. అంతేతప్ప, దొడ్డిదోవన జగన్‌కు సహకరిస్తామంటే కుదరదని తెగేసి చెప్పారు. జగన్మోహన్ రెడ్డితో తనకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవు కానీ, వారి ఆలోచనా విధానమే తనను ఇబ్బంది పెడుతోందని వెల్లడించారు.
అంతేగాకుండా.. సామాన్యుడిని పల్లకీ ఎక్కించాలంటే జనసేన పార్టీకి ప్రజలు ఓటెయ్యాలని పవన్ కల్యాణ్ సూచించారు. దోపిడీ జరగాలంటే జగన్ మోహన్ రెడ్డిని, అవినీతి, ఇసుక మాఫియా జరగాలంటే టీడీపీని గెలిపించాలని, అదే, సామాన్యుడి కష్టాలు గట్టెక్కాలంటే జనసేనకు పట్టం కట్టాలని పిలుపు నిచ్చారు.
ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల గురించి పవన్ ప్రస్తావించారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ గెలిచి అధికారంలోకి రాగానే మూడు నెలల్లోగా అగ్రిగోల్డ్ బాధితులందరికీ వారి డబ్బులిచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు.