చంద్రబాబుతోనే పంచాయతీ.. జగన్‌తో కలిసి పని చేస్తాం : కేసీఆర్

0
52

తమకు ఏపీ ప్రజలతో ఎలాంటి పంచాయతీ లేదనీ, కేవలం టీడీపీ అధినేత చంద్రబాబుతోనే పంచాయతీ ఉందని తెరాస అధినేత కేసీఆర్ స్పష్టంచేశారు. అదేసమయంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సర్వే రిపోర్ట్ తన చేతిలో ఉందని, జగన్ బ్రహ్మాండంగా గెలుస్తాడని, ఇక చంద్రబాబు ఖేల్ ఖతమని ఆయన జోస్యం చెప్పారు.

ఇరు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం తుది ఘట్టానికి చేరుకుంది. సోమవారం కేసీఆర్ వికారాబాద్‌లో జరిగిన టీఆర్ఎస్ సభలో మాట్లాడుతూ, జగన్‌తో కలిసి పనిచేస్తామన్నారు. ఏపీ సర్వే రిపోర్ట్ తన చేతిలో ఉందని, చంద్రబాబు ఖేల్ ఖతమన్నారు. జగన్ బ్రహ్మాండంగా గెలుస్తాడని, తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం ఆయనతో కలిసి పని చేస్తామని స్పష్టం చేశారు.

ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చే అంశంపై టీఆర్ఎస్ మద్దతు ఇస్తోందని ఆయన ప్రకటించారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయమై తమ పార్టీ ఎంపీలు సహకరిస్తారని హామీ ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని తమ ఎంపీలు లోక్‌సభలో చెప్పారని అన్నారు.

చంద్రబాబు వంటి కిరికిరి వ్యక్తులతోనే తప్ప ఏపీ ప్రజలతో తమ కెప్పుడూ పంచాయితీ లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు ఇష్టమొచ్చినట్టు తనను తిడుతున్నారని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని తాము అడ్డుకోవడం లేదని, దీని నిర్మాణానికి తెరాస సంపూర్ణ మద్దతు ఇస్తోందని స్పష్టం చేశారు.

గోదావరి జలాల్లో తెలంగాణ వాటా మాత్రమే అడుగుతున్నాం తప్ప, ఆ ప్రాజెక్ట్ నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని కేసీఆర్ తేల్చి చెప్పారు. గోదావరి జలాలు వృథాగా సముద్రంలో కలిసిపోతున్నాయని, దాని బదులు ఆ నీళ్లు వాడుకుంటే మంచిదే కదా? అని అన్నారు. తమకు కులం, మతం, వర్గం లేవని, అందరూ బాగుండాలని కోరుకుంటామని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

గతంలో వికారాబాద్ జిల్లా కావాలనే డిమాండ్ ఉండేదని, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే ఆ డిమాండ్‌ను నెరవేర్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ సందర్భంగా తెలంగాణలో తీసుకురానున్న కొత్త రెవెన్యూ చట్టం గురించి ఆయన ప్రస్తావించారు. జూన్ తర్వాత ఈ చట్టం అమల్లోకి తీసుకొస్తామని, రైతులు ఎవరికీ లంచాలో ఇవ్వొద్దని, వారి సమస్యలు పరిష్కరించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు.