రోజాను వణికిస్తున్న మహిళ… రసవత్తరంగా నగరి రాజకీయం

0
65

వైకాపా మహిళా నేత, ఫైర్‌బ్రాండ్ ఆర్.కె. రోజా పోటీ చేస్తున్న నియోజకవర్గం నగరి. చిత్తూరు జిల్లాలో ఉంది. ఈ స్థానం నుంచి ఆమె రెండోసారి సిట్టింగ్ ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్నారు. అయితే, ఈమె గెలుపునకు ఎత్తులు వేస్తుంటే, ఆమెను ఓడించాలని టీడీపీ, బీఎస్పీ, జనసేన నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. దీంతో ఇక్కడ ముక్కోణపు పోటీ నెలకొంది. ఫలితంగా నగరి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది.

ప్రత్యర్ధుల దూకుడుకు కళ్లెం వేసి విజయలక్ష్మిని వరించేందుకు.. ఎవరికి వారు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. వైసీపీ అభ్యర్థి రోజాను మరో మహిళా అభ్యర్థి టెన్షన్‌ పెడుతున్నారు. అలాగని ఆమె ప్రధాన పార్టీ అభ్యర్ధేమీ కాదు.. రోజాకు మాత్రం కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా నగరి నియోజకవర్గంలో ఆసక్తికర పోటీ నెలకొంది. వైసీపీ అభ్యర్థిగా రోజా బరిలో ఉండగా, టీడీపీ నుంచి గాలి ముద్దుకృష్ణమనాయుడు తనయుడు గాలి భానుప్రకాష్ పోటీలో ఉన్నారు. ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. ఇద్దరు అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. బహుజన్ సమాజ్‌వాది పార్టీ రూపంలో రోజాకు పెద్ద గండం పొంచి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

సాధారణంగా బీఎస్పీ అభ్యర్థి అంటే అంత టెన్షన్ పడాల్సిన పనిలేదు. కానీ నగరి లెక్కలు మాత్రం రోజాను టెన్షన్ పెడుతున్నాయి. జనసేన-బీఎస్పీ పొత్తులో భాగంగా నగరి సీటును బీఎస్పీ సొంతం చేసుకుంది. ఆ పార్టీ తరపున ఇక్కడి నుంచి ప్రవల్లిక బరిలో ఉన్నారు. విద్యావంతురాలైన ప్రవల్లిక.. తనదైన శైలిలో నియోజకవర్గం అంతటా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఎస్పీకి అండగా ఉండే ఎస్సీ సామాజికవర్గ ఓట్లను గణనీయంగా రాబట్టుకునేందుకు.. ఆ పార్టీ అభ్యర్థి ప్రవల్లిక ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామం రోజాను ఇబ్బందులకు గురి చేస్తోంది.

నగరి నియోజకవర్గంలో లక్ష 95 వేల మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్లలో సింహభాగం మొదలియార్‌లదే. వీరి సంఖ్య 60 నుంచి 70 వేల వరకు ఉంటుందని అంచనా. ఆ తర్వాత స్థానం ఎస్సీలదే. నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ మొత్తం కలిపి 45 నుంచి 50 వేల మధ్య ఓటర్లు ఉంటారని అంచనా. తర్వాతి స్థానం క్షత్రియ ఓటర్లదే. వీరి సంఖ్య పాతిక వేలు ఉంటుంది. 2014 ఎన్నికల్లో రోజా గెలుపు వెనుక కీలక పాత్ర ఎస్సీ ఓటర్లదే.

వైసీపీకి అండగా ఉందని భావిస్తున్న ఎస్సీ ఓట్లతోనే.. 2014 ఎన్నికల్లో రోజా అనూహ్య విజయం సాధించారు. ఈసారి కూడా ఎస్సీ, రెడ్డి, క్షత్రియ సామాజికవర్గ ఓటర్లపైనే రోజా ఆధారపడాల్సిన పరిస్థితి. ఎస్సీ సామాజికవర్గం అభిమానించే బహుజన సమాజ్ వాది పార్టీ నగిరిలో పోటీ చేస్తోంది. బీఎస్పీ తరపున విదేశాల్లో ఎంబీఏ, ఎమ్మెస్సీ చేసిన నాగబోయిన ప్రవల్లిక పోటీ చేస్తున్నారు.

నియోజకవర్గంలోని దళిత వాడలను, ఎస్సీ కాలనీలను ఆమె చుట్టేస్తున్నారు. ఎస్సీ ఓట్లను గణనీయంగా తన వైపు తిప్పుకునేందుకు ఆమె ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న రోజా ఈ నియోజకవర్గాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదని ప్రవల్లిక అంటున్నారు. అనేక ప్రాంతాల్లో కనీసం తాగునీరు కూడా లేదని, రోడ్లు లేవని ఎమ్మెల్యేగా రోజా దీనికి బాధ్యత వహించాలని ప్రవల్లిక అంటున్నారు.

నగరి బరిలో బీజేపీ అభ్యర్థిగా మరో మహిళ నిషిధ రాజు పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలో విద్యా సంస్థలు నిర్వహిస్తున్న నిషిధ రాజుకు.. క్షత్రియ సామాజిక వర్గ అండదండలు ఉన్నాయి. అదే ధైర్యంతో ఆమె నియోజకవర్గం అంతా కలియతిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రోజాపై నిషిధ రాజు సైతం భగ్గుమంటున్నారు. ఎమ్మెల్యేగా రోజా నియోజకవర్గాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని ఆమె ఆరోపిస్తున్నారు.

మొత్తం మీద నగిరిలో నెలకొన్న ఈ పరిణామం రోజాకు కలవరం కలిగిస్తోంది. తనకు, తమ పార్టీకి అండగా ఉన్న ఎస్సీ ఓటు బ్యాంకు… బీఎస్పీ కారణంగా చీలిక వస్తుందేమోనన్న అనుమానం .. రోజాను వెంటాడుతోంది. తనకు లభించే క్షత్రియ సామాజిక వర్గం ఓట్లకు… బీజేపీ అభ్యర్థి వల్ల గండి పడుతుందన్న కలవరం రోజాలో మొదలైంది. దీంతో నగరి ఫలితం ఎలా ఉంటుందోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది.