స్నేహమంటే ఇదేనా? అలీ చేసిన ద్రోహానికి బంధుమిత్రులను కూడా నమ్మను : పవన్

0
37
pawan kalyan
pawan kalyan

వైసీపీ నేత, సినీ నటుడు అలీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్నేహమంటే ఇదేనా అంటూ ప్రశ్నించారు. కష్టాల్లో ఉన్నప్పుడు అలీకి అండగా ఉన్నానని… తనతో కలసి పని చేస్తానని చెప్పి, తనను వదిలి వైసీపీలోకి వెళ్లాడన్నారు. స్నేహమంటే ఇదేనా? అని ప్రశ్నించారు. అలీలాంటి వాళ్ల వల్ల మనుషులపై నమ్మకం పోతుందని అన్నారు.

అవసరంలో ఆదుకున్న అలీనే వదిలేసి వెళ్లిపోతే… ఇంకెవరిని నమ్మాలని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల వల్లే ప్రజలను మినహా బంధుమిత్రులను నమ్మలేకపోతున్నానని చెప్పారు. అలీని వైసీపీ నేతలు వాడుకుంటున్నారని… ఎంపీ టికెట్ ఇస్తామంటే వైసీపీలో అలీ చేరాడని చెప్పారు.

తన ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ రాజమండ్రిలో జరిగిన రోడ్ షోలో మాట్లాడుతూ తన తండ్రి వైయస్సార్ శవం కూడా దొరక్కముందే సీఎం అయ్యేందుకు జగన్ ప్రయత్నించారని… అలాంటి వ్యక్తి రాష్ట్రానికి అవసరమా? అని పవన్ ప్రశ్నించారు.

వైఎస్ బావమరిది రవీంద్రారెడ్డి సినిమా తీయాలని తనను బెదిరించారని… బెదిరిస్తే తోలు తీస్తానని హెచ్చరించానన్నారు. తాను రాజకీయాల్లో రాణించలేనని ఎలా అంటారని… తాను స్టార్ హీరోని అవుతానని ఎవరైనా ఊహించారా? అని ప్రశ్నించారు.

రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ ఎన్నికల్లో ఓడిపోతారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ జోస్యం చెప్పారు. గోదావరి పుష్కరాల నిధులతో పాటు దేవుడి సొమ్మును కూడా కొందరు స్వాహా చేశారని అంత కక్కుర్తి ఎందుకని మండిపడ్డారు.

బీజేపీ, కాంగ్రెస్ తర్వాత జాతీయ పార్టీ బీఎస్పీనే అని పవన్ అభిప్రాయపడ్డారు. మార్పు కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని, పార్టీల తరుపున కోవర్టులను పంపిస్తే సహించేది లేదన్నారు. ఎందరో నేతలు రాజకీయాల్లో మార్పు కోరుకుంటున్నారని పవన్ అభిప్రాయపడ్డారు. సచార్ కమిటీ సిఫార్సులు అమలు చేసేలా ఒత్తిడి తెస్తామన్నారు.