నిజామాబాద్‌లో ఎన్నికల ఖర్చు ఎంతో తెలుసా?

0
57

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ లోక్‌సభ స్థానం ఎన్నిక ఈసారి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించింది. దీనికి కారణం ఇక్కడ నుంచి ఏకంగా 185 మంది అభ్యర్థులు బరిలో ఉండటమే దీనికి కారణం. ఫలితంగా ఈ స్థానం ఖర్చు ఏకంగా రూ.35 కోట్లకు మించిపోతుందని ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు.

సాధారణంగా పార్లమెంట్ స్థానం పరిధిలో ఒక్కో సెగ్మెంట్‌కు 3 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అయితే, ఒక్క నిజామాబాద్‌లోనే 5 కోట్లు దాటే అవకాశం ఉంది. ఇక్కడ ఎన్నికల వ్యయం 35 కోట్ల రూపాయలు దాటుతుందని అధికారులు చెబుతున్నారు.

నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని మొత్తం 1788 పోలింగ్ కేంద్రాల్లో ఒక్కో వీవీ ప్యాట్, ఒక్కో కంట్రోలింగ్ యూనిట్‌తో పాటు 12 చొప్పున 25 వేలకు పైగా ఈవీఎంలు వినియోగిస్తున్నారు. మరోవైపు పోలింగ్‌ సిబ్బంది సైతం, ఎక్కవ సంఖ్యలోనే విధులు నిర్వహించనున్నారు.

ఒక పోలింగ్ కేంద్రంలో మామూలుగా నలుగురు సిబ్బందిని నియమిస్తారు. ఇక్కడ మాత్రం మరో ఇద్దరిని అదనంగా కేటాయించారు. ఇలా నిజామాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో కలిసి సిబ్బంది సంఖ్య 9 వేలు దాటింది. వీరితో పాటు నోడల్ అధికారులు, మండల స్థాయి పరిశీలకులు, ప్రత్యేక పరిశీలకులను కూడా నియమించారు.

ఈవీఎంల పరిశీలనకు హైదరాబాద్, బెంగళూరు నుంచి 150 మంది ఇంజనీర్లు నిజామాబాద్ వచ్చారు. ఇక పోలింగ్ రోజున సుమారు 400 మంది ఇంజనీర్లు తమ సేవలను అందించనున్నారు. బరిలో ఉన్న 185 మంది అభ్యర్థుల వివరాలతో ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు.

పోలింగ్ రోజు ఈవీఎంలలో ఏదైనా సాంకేతిక సమస్యలు వస్తే వెంటనే మార్చడానికి హెలికాప్టర్‌ను అందుబాటులో ఉంచనున్నారు. మరోవైపు, ఇక్కడి పోలింగ్‌ వేళలను కూడా సవరించారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. సాయంత్రం 6 గంటలలోగా క్యూలో నిల్చున్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు.