అన్నయ్యపై అందుకే పవన్ కల్యాణ్‌కు కోపమొచ్చింది… పవర్ ప్రస్థానం ఇదే..

0
37
pawan kalyan
pawan kalyan

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినీ, రాజకీయ రంగాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాల నుంచి.. రాజకీయాల్లోకి వచ్చిన జనసేనానికి భారీగా ఫ్యాన్స్ మద్దతుంది. 2014 ఎన్నికల ముందే జనసేన ఏర్పాటు చేసినప్పటికీ.. ఆ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చిన పవన్.. చంద్రబాబు సీఎం కావడంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో జనసేన బరిలో దిగడంతో ఏపీలో త్రిముఖ పోరు నెలకొంది. పవన్ ఫ్యాక్టర్ మిగతా పార్టీలను కలవరానికి గురిచేస్తోంది. మరి ఈ ఎన్నికల ఫలితాలు ఎలా వుంటాయనేది తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే.

ఈ నేపథ్యంలో జనసేన పార్టీ రాజకీయ ప్రస్థానం గురించి తెలుసుకుందాం. 2014 మార్చి 14న జనసేన ప్రారంభమైంది. కానీ అంతకు ఐదేళ్ల ముందే పవన్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2008 ఆగష్టు 26న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రజారాజ్యంలో యువరాజ్యం అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. పీఆర్పీ ఎంట్రీతో 2009 ఎన్నికల్లో త్రిముఖ పోరు నెలకొంది. ఆ ఎన్నికల్లో చిరంజీవి పార్టీ ఆశించిన స్థాయిలో సీట్లు రాబట్టలేకపోయింది. కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ చీలడంతో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చింది. అనంతర పరిణామాలతో పీఆర్పీ కాంగ్రెస్‌లో విలీనమైంది. పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం ఆయనకు ఇష్టం లేదు. ఈ కారణంగానే రెండేళ్లపాటు అన్నయ్య చిరంజీవితో పవన్ మాట్లాడలేదు.

రాజకీయాల్లోకి రావడం కోసమే సినిమాల్లోకి వచ్చానని చెప్పే పవన్.. పీఆర్పీ ప్రస్థానం అర్ధాంతరంగా ముగిసిపోవడాన్ని జీర్ణించకోలేకపోయారు. సినిమాల్లో స్టార్‌గా వెలుగొందుతుండగానే.. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. రాష్ట్ర విభజన ఖాయమయ్యాక.. 2014 ఎన్నికలు మరెంతో దూరంలో లేవనగా.. 2014 మార్చి 14న జనసేన పార్టీని పవన్ స్థాపించారు. ప్రశ్నిస్తానంటూ.. ఆయన రాజకీయాల్లో అడుపెట్టారు. పవర్ స్టార్ కాస్తా.. జనసేనానిగా మారారు. ఆ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి.. అనుభవజ్ఞుడైన చంద్రబాబు విజయానికి కృషి చేశారు.

2014 ఎన్నికల తర్వాత అధికార పార్టీకి టైం ఇచ్చే ఉద్దేశంతో పవన్ సైలెంట్ అయ్యారు. ఉద్దానం కిడ్నీ బాధితుల తరఫున పోరాటం, రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల పక్షాన పోరాడటం.. ఇలా అడపాదడపా ప్రజాసమస్యలపై గళం వినిపించిన పవన్.. 2018 మార్చిలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. తొలిసారి టీడీపీకి, చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడారు. ప్రత్యేక హోదాపై పదే పదే మాట మార్చిన బాబు వైఖరిని తప్పుబట్టారు.

ప్రత్యేక హోదా అడిగితే.. ప్యాకేజీ పేరిట పాచిపోయిన లడ్డులూ ఇచ్చారంటూ జనసేనాని కేంద్రం తీరును విమర్శించారు. మొదటి నుంచి ఏపీకి హోదా కావాలనే వైఖరికే ఆయన కట్టుబడ్డారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టండి.. అవసరమైతే ఎంపీల మద్దతు నేను కూడగతానంటూ ముందుకొచ్చారు.

2019 ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు, బీఎస్పీతో పొత్తు పెట్టుకుని జనసేనాని ఎన్నికల బరిలో దిగారు. ఎన్నికల ముందు అనూహ్యంగా బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడం పట్ల వైఎస్ఆర్సీపీ అనుమానాలు వ్యక్తం చేసింది. టీడీపీ, జనసేన మధ్య రహస్య పొత్తు ఉందని విపక్షం ఆరోపించింది. కానీ జనసేనాని వాటిని తిప్పికొట్టారు. వచ్చే ఎన్నికల తర్వాత కానిస్టేబుల్ కొడుకు సీఎం అవుతాడంటూ.. జనసైనికులను ఉత్సాహపరుస్తూ ముందుకెళ్తున్నారు. నా తుదిశ్వాస విడిచే వరకు పార్టీని నడపుతానంటూ.. ఎన్నికల తర్వాత జనసేన ఉండదని విమర్శించే వాళ్లకు జనసేనాని గట్టిగా బదులిచ్చారు.