వీవీ ప్యాట్ల లెక్కింపు విషయంలో సుప్రీంకోర్టు కీలక రూలింగ్ ఇచ్చింది. ప్రతి నియోజకవర్గంలో వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కించాలని సూచన చేసింది. ఈ విషయంలో ఈసీ చేసిన వాదనలను కొట్టిపారేసింది. అదేసమయంలో ప్రతిపక్ష పార్టీలకు కాస్త కుదుటపడేలా తీర్పునిచ్చింది.
అయితే, రాజకీయ పార్టీలను ఇప్పుడు కొత్త ఆందోళన వెంటాడుతోంది. దాన్ని నివృత్తిచేసే సమాధానం ఎన్నికల కమిషన్ వద్ద లేకపోవడం మరింత ఆందోళనకు కారణమైంది. ఈవీఎమ్‌లతోపాటు వీవీప్యాట్లను లెక్కించినప్పుడు ఓట్ల లెక్కల్లో తేడా వస్తే ఏం చేయాలి? దాన్ని ఎలా సెటిల్ చేస్తారు? ఇది పార్టీలకొస్తున్న ప్రశ్న.
“ఏమో…ఏం చేయాలో మాకు ఇంకా ఏమీ చెప్పలేదు” అని ఈసీ అధికారులు చెబుతున్నారు. దీంతో ఇటు పార్టీలు, అటు ఎన్నికల అధికారుల్లోనూ టెన్షన్ నెలకొంది. ఉదాహరణకు ఓ అభ్యర్థికి ఈవీఎమ్‌లో 490 ఓట్లు వచ్చి… వీవీప్యాట్ స్లిప్‌లను లెక్కిస్తే కేవలం 450నే వస్తే ఏం చేయాలి? మిగిలిన 40 స్లిప్‌ల సంగతేమిటి? ఈ రెండింటిలో దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలి? వీవీప్యాట్‌లోనే ఎక్కువ స్లిప్‌లు వచ్చి…. ఈవీఎమ్‌లో తక్కువ ఓట్లు తేలితే అప్పుడేం చేయాలి? వీటినే ఎన్నికల కమిషన్ అధికారుల వద్ద ప్రస్తావించగా… మాకేం తెలుసు? అని బదులిస్తున్నారు.
“ఈ రెండు అంశాలపై ఈసీ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలి. వాటిపై రాజకీయ పార్టీలు సమ్మతించాలి. లేదంటే న్యాయపరమైన చిక్కులొస్తాయి. చాలా తీవ్రమైన తేడాలొచ్చిన దగ్గర సమస్యలొచ్చే అవకాశం ఉంది” అని ఈసీ అధికారులు అభిప్రాయపడుతున్నారు.