తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ జీవితమంతా అబద్ధాలేనని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. వికారాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన నేపథ్యంలో బాబు స్పందించారు.
కృష్ణా జిల్లా పెడనలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ, ‘కేసీఆర్ ఇప్పుడిప్పుడే దారికొస్తున్నారు. ప్రత్యేక హోదాకు మద్దతు ఇవ్వడం సంతోషం’ అని అన్నారు. అయితే, ప్రత్యేక హోదాపై అవిశ్వాసం పెట్టినప్పుడు కేసీఆర్ ఎందుకు మద్దతివ్వలేదని ప్రశ్నించారు.
ఏపీకి హోదా ఇస్తే తెలంగాణకు కూడా ఇవ్వాలని కేసీఆర్ అన్నారని చెప్పారు. హైదరాబాద్ ఆస్తుల్లో 58 శాతం వాటా ఇవ్వాలని సుప్రీంకోర్టు చెబితే కేంద్రం సహకారంతో కేసీఆర్ అడ్డుపడ్డారన్న బాబు.. జగన్ పార్టీకి వెయ్యి కోట్లు పంపించి ఏపీకి లక్ష కోట్లు ఎగ్గొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు.
గత వారం నుంచి కేసీఆర్‌ను బట్టలు ఉతికినట్లు ఉతికి ఆరేస్తున్నానని గుర్తుచేశారు. ఆంధ్రావాళ్లు ద్రోహులని కేసీఆర్ తిట్టలేదా?. తెలుగుతల్లిని కించపరిచేలా మట్లాడలేదా? ఆంధ్రావాళ్లు పనికిరాని దద్దమ్మలనలేదా? అని ప్రశ్నించారు. తనకు కూడా తెలివి లేదంటున్నారని.. ఏకంగా తననే ఛాలెంజ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్.. కేసీఆర్‌తో కలిసి నాటకాలు ఆడుతున్నారని.. కేసీఆర్ తనపై పెత్తనం చేయాలనుకుంటున్నారని బాబు చెప్పారు.