పోలీసులు ఓవర్ యాక్షన్ చేసి డబ్బు పట్టుకున్నారు.. బీజేపీ

0
64

హైదరాబాద్ నారాయణగూడలో సోమవారం పోలీసులు స్వాధీనం చేసుకున్న రూ.8 కోట్ల డబ్బు తమ పార్టీకి సంబంధించినదని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగరరావు వెల్లడించారు. పార్టీ ఖాతా నుంచి చెక్కు ద్వారా ఆ డబ్బు డ్రా చేశామన్నారు. డబ్బు డ్రా విషయంలో నిబంధనలు అతిక్రమించలేదని స్పష్టం చేశారు. ఈమేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

‘మా అకౌంటెంట్ బ్యాంకు నుంచి డబ్బును పార్టీ కార్యాలయానికి తీసుకొస్తుంటే పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు ఓవర్‌ యాక్షన్‌ చేశారు’ అని అన్నారు. వివిధ వస్తువులు సరఫరా చేసిన వారికి బకాయిలు చెల్లించేందుకే ఆ డబ్బును డ్రా చేశామని కృష్ణసాగరరావు వివరించారు. కాగా, సోమవారం సాయంత్రం హైదరాబాద్, నారాయణగూడ ఫ్లై ఓవర్‌ వద్ద టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టిన సమయంలో ఓ వాహనంలోని రూ.8 కోట్లు స్వాధీనం చేసుకున్న విషయం తెల్సిందే.