ఎన్నికలు.. సొంత గ్రామాలకు ప్రజలు.. క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ బస్సులు

0
43

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్నికల కోసం ప్రజలు సొంత ప్రాంతాలకు చేరుకుంటున్నారు. ఇందుకోసం రైళ్లు, బస్సుల వెంట పరుగులు తీస్తున్నారు. ఓటు కోసం సొంత వూర్లకు వెళ్లే ప్రజల నుంచి భారీగా గుంజుకునేందుకు ప్రైవేట్ బస్సు యాజమాన్యాలు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా, హైదరాబాద్‌లో నివసిస్తున్న ఏపీకి చెందిన ఓటర్లు తమ ఊర్లకు బయలుదేరుతున్నారు.

రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటికే రిజర్వేషన్లు దొరకట్లేదు. వెయిటింగ్ లిస్ట్‌లో కూడా అవకాశం దక్కని పరిస్థితి. ఈ పరిస్థితిని ప్రైవేట్ బస్సు యాజమాన్యాలు బాగా క్యాష్ చేసుకుంటున్నాయి. వాళ్లు చెప్పిందే ‘టికెట్ ధర’ అన్నట్టుగా ఉంది. అయినా, పట్టించుకోని ప్రయాణికులు ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీంతో మామూలు టికెట్ ధర కంటే రెండు, మూడు రెట్లు అధికంగా ప్రైవేట్ బస్సుల వాళ్లు గుంజుతున్నారు. సాధారణ రోజుల్లో నడిపే బస్సుల సంఖ్య చాలట్లేదని, ఇంకా ఎక్కువ సంఖ్యలోనే బస్సులు నడుపుతామని ఓ ప్రైవేట్ ట్రావెల్స్ వ్యక్తి చెప్పారు.

ఇదిలా ఉండగా, ఏపీలోని కొన్ని నియోజక వర్గాలకు చెందిన నాయకులు నేరుగా హైదరాబాద్‌కు బస్సులు పంపే ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. తమ నియోజకవర్గం ఓటర్లను ఒకే చోటుకు చేర్చి, అక్కడి నుంచి సొంత వాహనాల్లో తరలించే పనిలో కొంతమంది నాయకులు ఉన్నట్టు సమాచారం.